కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. “భాజపా, ఆరెస్సెస్‌తో పాటు దేశంపై కూడా కాంగ్రెస్ పోరాడుతోంది” అని ఇటీవల వ్యాఖ్యానించిన రాహుల్‌పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఫిర్యాదును మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.
చాటియా తన ఫిర్యాదులో, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్రత హద్దులను దాటాయని, అవి జాతీయ భద్రతకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఆయన ప్రకటనలు అశాంతికి దారితీయడంతో పాటు వేర్పాటువాద భావాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నట్లు ఆరోపించారు. “ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది. కానీ ఆయన అబద్ధాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యతను ప్రమాదంలో పడేస్తున్నారు” అని చాటియా వ్యాఖ్యానించారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ఇటీవల దిల్లీలో కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. ఆయన “భాజపా, ఆరెస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నాయి. మా భావజాలం వేల ఏళ్ల నాటిది” అని అన్నారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అసలైన మనస్తత్వం బయటపడిందని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.

