ప్రయాగరాజ్ వేదికగా జనవరి 14న ప్రారంభం కానున్న మహా కుంభమేళ కోసం అన్ని ప్రాంతాల భక్తులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ మహా కుంభమేళలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తుల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అదనంగా 26 ప్రత్యేక రైళ్లు నడుపుతుందని గురువారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం నుండి, తెలంగాణలో సికింద్రాబాద్, వికారాబాద్, మౌలాలి జంక్షన్ నుండి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
అదేవిధంగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహా కుంభమేళ కోసం భారీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల అవసరాలు, భద్రత, గంగాస్నానానికి అనువైన వాతావరణం కల్పించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది కుంభమేళలో దాదాపు 45 కోట్లకు పైగా భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరించనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేళా ప్రాంగణంలో తాగునీరు, తాత్కాలిక నివాసాలు, వైద్య సదుపాయాలు, భద్రత కోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.

