భారత రక్షణ వ్యవస్థపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత విషయంలో మనం అంత అదృష్టవంతులం కాదని పేర్కొన్నారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఆర్మీ నిత్యం ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తుచేసి, భద్రత పరంగా మరింత నిఘా అవసరమని సూచించారు. మధ్యప్రదేశ్లో ఇందౌర్ జిల్లా మావ్ కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, “దేశ భద్రతకు సంబంధించి శత్రువుల కుట్రలను సమర్థంగా అరికట్టడం ఎంతో అవసరం. ఉత్తర సరిహద్దుల్లో చైనా, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్ వంటి శత్రు దేశాల నుంచి ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా, దేశ అంతర్గత భద్రత విషయంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉండటం సాధ్యం కాదు. శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి, వాటిని ముందుగానే అడ్డుకోవడం అత్యంత కీలకం” అని ఆయన తెలిపారు. దేశ భద్రతను పటిష్ఠంగా నిర్వహించేందుకు నిఘా వ్యవస్థను మరింత శక్తివంతం చేయాలని ఆయన సైన్యానికి పిలుపునిచ్చారు.

