మేడిపల్లి బాయ్స్ హాస్టల్‌లో వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మల్లికార్జున నగర్‌లోని హాస్టల్‌లో మహేందర్ రెడ్డి (38) అనే వ్యక్తిని అదే హాస్టల్‌లో నివసిస్తున్న కిరణ్ రెడ్డి అతి కిరాతంగా హతమార్చాడు. వంట సామగ్రితో దాడి చేసి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేశాడు. మహేందర్ రెడ్డి జనగామకు చెందినవాడు. గతంలో ఈ హాస్టల్‌లో నివసించేవాడు. హాస్టల్ నిర్వహకురాలితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే ఇటీవల హాస్టల్ నిర్వాహకురాలు కిరణ్ రెడ్డితో సంబంధం కొనసాగిస్తున్నది.
శుక్రవారం అర్ధరాత్రి మహేందర్ హాస్టల్‌కి రాగానే, ఈ అంశంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కిరణ్, మహేందర్‌పై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు కిరణ్ రెడ్డిని, హాస్టల్ నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. మహేందర్‌ను పిలిపించి పథకం ప్రకారం హత్య చేశారా? లేక గొడవతో క్షణికావేశంలో ఈ దాడి జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

