వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొని, హౌజ్‌ఫుల్ షోలతో మంచి వసూళ్లను నమోదు చేసింది.
ఇప్పటివరకు ఈ సినిమా ఐదో రోజుకే రూ. 12.75 కోట్లు వసూలు చేసి, ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ట్రిపులార్ (రూ. 13.63 కోట్లు) ఉంటే, “సంక్రాంతికి వస్తున్నాం” వెంటనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో “అల వైకుంఠపురం” (రూ. 11.43 కోట్లు), నాల్గవ స్థానంలో “బాహుబలి 2” (రూ. 11.35 కోట్లు), ఐదవ స్థానంలో ప్రభాస్ నటించిన “కల్కి 2898 ఏడీ” (రూ. 10.86 కోట్లు) ఉన్నాయి.
ఇక్కడితోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. మొదటి రోజే 7 లక్షల డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం, తాజాగా 2 మిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. వెంకటేష్ కెరీర్‌లో ఇదే అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన సినిమా అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించగా, దర్శకుడు అనిల్ రావిపూడి తన వినోదాత్మక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతమైన ఆదరణ లభించడంతో సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. పోటీగా మరే పెద్ద సినిమా లేకపోవడం వల్ల “సంక్రాంతికి వస్తున్నాం” వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

