పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు యథావిధిగానే వాయిదాలతో ప్రారంభమయ్యాయి. పట్టువిడుపులు లేని అధికార, ప్రతిపక్షాలు విలువైన ప్రజా కాలాన్ని, ధనాన్ని నిర్వీర్యం చేస్తూ తమ పంతాలకు, పట్టువిడుపులకు వేదికగా చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ప్రజల కోసం ఉద్దేశించిందిన్న ఇంగితం ఇసుమంతైనా అధికార, విపక్షాలకు లేదు. మొక్కుబడిగా సమావేశాలకు హాజరు కావడం మామూలైపోయింది. ప్రజాప్రతినిధులుగా నిజంగానే ప్రజలకు న్యాయం చేస్తున్నామా? అన్న ఆలోచన ఏ పార్టీకీ, ఏ నాయకుడికీ లేకుండా పోయింది. తొలి రోజే వాయిదా తీర్మానాలు ఇవ్వడం, గొడవ చేయడం వంటి చర్యలు ఈ సమావేశాల్లోనూ కనిపించాయి. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఓపెనిగింగ్ రోజే వాయిదాతో సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షం చెప్పినదాన్ని అధికార పక్షం వినకపోవడం, అధికార పక్షాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం, గొడవ చేస్తేనే ప్రతిపక్షం అన్నట్లుగా సమావేశాలుంటున్నాయి.
పార్లమెంటులో సమస్యలపై చర్చించేందుకు రాజ్యాంగం కొన్ని పద్ధతులు, నియమనిబంధనలను పొందుపరిచింది. సభలో ప్రస్థావించి, చర్చించి, జవాబు రాబట్టడం ప్రతిపక్షం విధి. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానపరచడం తద్వారా ప్రజలకు ఆ సమాచారాన్ని చేరే విధంగా చేసుకోవడం ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు ఈ రెండూ భూతద్దం పెట్టి వెతికినా దొరకని బ్రహ్మ పదార్థాలయ్యాయి. జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీఏ) గా జట్టు కట్టిన బీజేపీకి పార్లమెంట్ అన్నా, ప్రతిపక్షమన్నా జంకు లేకుండాపోయింది. ప్రగతిశీల ఐక్య కూటమి (యూపీఏ)గా ఏర్పడ్డ కాంగ్రెస్ కి కూడా పార్లమెంటు, ప్రభుత్వం అన్నా లెక్కలేకుండా పోయింది. ఈ రెండు కూటమిలకు ప్రజలంటే అంతకన్నా గౌరవం లేకుండా పోతోంది. అతి పెద్దదైన ప్రజాస్వామిక దేశంలో పార్లమెంటులో కూడదీసుకున్న కూటమి బలం మాత్రమే ఉన్న అధికార పక్షం, బలహీనమైన ప్రతిపక్షం, కలిసి ప్రజలు, ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా, పార్లమెంటరీ వ్యవస్థను అవమానిస్తూ, విలువైన సభాసమయాన్ని, డబ్బును వ్రుథా చేస్తూ, నిరర్ధకమైన, పేలవమైన పర్ఫార్మెన్స్ ను ప్రదర్శిస్తున్నాయి.
పార్లమెంట్ సమావేశాలు ఆగస్ట్ 21 వరకు అంటే దాదాపు నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. ఆగస్టు12 నుంచి 18 వరకు సమావేశాలకు సెలవులు ఉంటాయి. ఈ సమావేశాల్లో మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు మరో 8 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఇక, దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి వాటిపై చర్చించాలని ఇండియా కూటమి పట్టుదలతో ఉంది. భారత, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని, ట్రంప్ పదేపదే చెప్పడం, దేశ ఆంతరంగిక భద్రత విషయాలలో అమెరికా ప్రమేయం ఏంటని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని, అమెరికా పట్ల భారత్ వైఖరిని తెలపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చకు కావాలసిన సమయాన్ని కేటాయిస్తూనే, ప్రతిపక్షాన్ని, ప్రత్యేకించి కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి బీజేపీ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వాడీ వేడీగా జరగనున్నాయి. పార్లమెంట్ లోపలా, బయటా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ఎజెండాను రూపొందించుకుని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రతిసారీ విఫలమవుతోంది. 75 ఏళ్లకు చేరువలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీతో పోటీ పడటంలో 50 ఏళ్లు పైబడిన రాహుల్‌గాంధీ వెనుకబడుతున్నారు. స్పష్టమైన విధానాలు, నాయకత్వం లోపాలే దీనికి కారణం.
పార్లమెంట్ సమావేశాలకు తయారు కావడమంటే, ప్రజాభిప్రాయంపై స్పష్టత ఉండాలి. ఎలా చర్చించాలన్న వ్యూహం ఉండాలి. అధికార పార్టీని నిలదీయాలి. ప్రజలతో మెప్పులు పొందాలి. వ్యూహాల లోపమే కాంగ్రెస్ ను పార్లమెంటులో పలచన చేస్తోంది. మెజార్టీ ప్రజలకు దూరం చేస్తోంది. యువతరాన్ని ఆకట్టుకోలేకపోతోంది. సమస్యలెదురైనప్పుడే సత్తా చాటాలి. అందుకు పార్లమెంట్‌ను వేదిక చేసుకోవాలి. ముందుతరాన్ని పరిశీలిస్తే, ప్రస్తుత తరం అనుసరించాల్సిన లక్ష్యాలు అర్థమవుతాయి.
నెహ్రూ, ఇందిర, రాజీవ్, పీవీ, మన్మోహన్ వంటి వారు అనుసరించిన విధానాలను అధ్యయనం చేస్తే కదా కనీసం ఏం చేయాలన్నది తెలిసేది. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను, పోకడలను ఆకళింపు చేసుకొని అందుకు అనుగుణంగా పార్టీకి దిశానిర్దేశం చేయడంలో రాహుల్ విఫలం అవుతున్నారా? మరోవైపు ప్రధాని మోడీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తూ పార్లమెంటులో తన వాగ్ధాటిని వినిపిస్తున్నారా?ఆలోచించాలి. సమస్య ఏదైనా సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పీకర్ ప్రకటించారు. అలాంటప్పుడు వివేచన లేకుండా వాయిదా తీర్మానాలు ఇస్తే, వాటిని స్పీకర్ తిరస్కరించడం షరామామూలే! అలాకాకుండా సమస్యలను అధ్యయనం చేసి, నోటీసులు ఇచ్చి చర్చకు పట్టుబట్టాలి. మరి కాంగ్రెస్ సరే, కాంగ్రెస్ కూటమి పార్టీలు ఏం చేస్తున్నాయి? తక్షణ చర్చ అన్నది తర్కానికి నిలవదు. తర్పానికి మాత్రమే అక్కరకు వస్తుంది. పార్లమెంట్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ప్రభుత్వాన్ని నిలదీయాలి. తప్పులుంటే దోషిగా నిలబెట్టాలి.
బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాల మీదే సాఫల్యమవుతోంది. సరైన సమయానుకూల ఎత్తుగడల్లో కాంగ్రెస్ విఫలమవుతోంది. కాంగ్రెస్ లోపాల కారణంగానే క్రమంగా బీజేపీ జనాలకు దగ్గరవుతుండగా, కాంగ్రెస్ దూరమవుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ఈ వాస్తవాన్ని గ్రహిస్తుందా? పాతరం యువతరం మనోభావాలను గుర్తిస్తుందా? ఇంటా బయటా బీజేపీని ఢీ కొంటుందా? ప్రభుత్వాన్ని నిలదీస్తుందా? పార్లమెంటులో ప్రజల మనసులను గెలుస్తుందా? అన్న అంశాలపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అధికార, ప్రతిపక్షాలు విఫలమైతే ప్రజలు మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోక తప్పదు.

