BANAKACHARLA| బనకచర్ల బనికి వచ్చే PROJECT| ప్రాజెక్టా? లేక బనికిరాని ప్రాజెక్టా? లేక కాళేశ్వరం తరహాలోనే సర్కారు ఖజానా ఖాళీ చేసి, నేతలు, కాంట్రాక్టర్ల జేబులు నింపే కుంపటా? కూలేశ్వరం కాదు కదా? పెండింగ్ ప్రాజెక్టులుండగా కొత్తగా. POLAVARAM| పోలవరం ఇంకా పూర్తి కాకుండానే, మరో ప్రాజెక్టును చేపట్టడం అవసరమా? అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి బనకచర్ల పెను భారం కాదా? అంతకంటే ముందు కేంద్రంతో పేచీ, పక్క రాష్ట్రంగా ఉన్న తెలంగాణతో లొల్లి. ఇదంతా అవసరమా? పోనీ, ఈ ప్రాజెక్టుతో మొత్తం ఏపీకి ఒరిగేదేంటి? పారే నీరెంత? పండే ఎకరాలెన్ని? అయ్యే ఖర్చు ఎంత? ఓట్లేసి, గెలిపించి, జనరంజకంగా పరిపాలించండిరా బాబూ! అంటే ఈ పంచాయితీలేంటి? ఈ బీరాలు దేనికి? బేరాలు దేనికి?
ఆంధ్రకు వరం పోలవరం అంటూ హంగామా చేసిన నేతలే నేడు బనకచర్ల గురించి హడావుడి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కూడా కాంట్రాక్టర్ల, రాజకీయ నాయకుల జేబులు నింపేది కాకూడదన్నదే సకలజనుల అభిప్రాయం. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించి తద్వారా రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు ఇవ్వడం లక్ష్యమని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. గోదావరి నుండి ప్రతి ఏటా వృథాగా సముద్రంలో కలిసిపోయే నీటిలో పదో వంతు కనీసం 200 టీఎంసీల నీటిని మళ్లిస్తే రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెరుగుతుందంటూ నేతలు ఊదరగొడుతున్నారు. ఇందుకోసం రూ.80,112 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసి, జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలని ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి 48 వేల ఎకరాల భూమిని సేకరించడం, 27 కిలో మీటర్ల సొరంగం తవ్వడం, రూ.80 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
బనకచర్ల ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు. కింది నుండి పైకి నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఇందుకు ప్రతి సంవత్సరం భారీగా ఖర్చు చేయాలి. నిపుణుల అంచనా ప్రకారం కొత్తగా సాగులోకి వచ్చే మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రూ.50 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చును ఎవరు భరించాలి? కాళేశ్వరంలో ఇదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేస్తే, విద్యుత్ వినియోగం తడిసి మోపెడు అవుతుంది. కళ్లముందు కనిపిస్తున్న సత్యాన్ని విస్మరించి బాబు బనకచర్ల అనగానే కేంద్రం తలూపడం సరికాదు.
కాళేశ్వరం గత తప్పిదాలను పక్కన పెట్టి బనకచర్లపై ఏదో కొంపలు అంటుకున్నట్లుగా బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది. ఒక్కసారిగా ప్రాజెక్టులన్నీ దెబ్బతిన్నా యని, వాటికి ప్రమాదం పొంచివుందని నానా యాగీ చేస్తున్నారు. పదేళ్లలో లేని ప్రమాదం ఏడాదిన్నరలో ఎలా వచ్చిందో ఆ నేతలే చెప్పాలి. అదే పనిగా చెబితే అబద్దాలు నిజాలై పోవు. కాళేశ్వంరపై ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలో భాగంగా బీఆర్‌ఎస్ ఈ హంగామా చేస్తోంది. తెలంగాణ ఆగమై పోయిందన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్ నేతలు చేసే ఆరోపణలు నిజమైతే అందుకు ముందుగా వారే బాధ్యత వహించాలి.
చంద్రబాబు కూడా పోలవరం పూర్తి కాకుండానే ఇప్పుడు బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు లోటు బడ్జెట్‌లో దీనికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ తోపాటు ఇతర హావిూలు అమలు చేయడానికి ఖజానా ఖాళీ అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్ల భారీ ఖర్చుతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాననడం అనుమానాలకు తావిస్తోంది. అఖిలపక్ష సమావేశం వేసి, నీటిపారుదలరంగ నిపుణుల అభిప్రాయాలను, సూచనలను తీసుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత. ఆ తరవాతే దీనిపై ముందుకు సాగాలి. ముందు పోలవరం సజావుగా పూర్తి కావాలి. పోలవరం బాధితులు ఇప్పటికే రోడ్డున పడ్డారు. వారిని ఆదుకునే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. భూములు, ఇళ్లు కోల్పోయిన గిగిరిజనులు గౌరవంగా బతికేలా చేయాలి. అమరావతికి భూమలు ఇచ్చిన రైతులు కూడా దర్జాగా బతకగలగాలి. ఈ ప్రాజెక్టు గేమ్ చేంజర్, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, హైబ్రిడ్ యాన్యూటీ (హమ్) స్కీమ్ అని చెబుతున్నారు. ప్రాజెక్టులు కట్టి, నీటిపారుదల అభివృద్ధి చేస్తే ఎవరికి అభ్యంతరం వుండదు. కానీ గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాలో అలా జరగలేదు. ఉమ్మడి ఎపిలో కూడా చంద్రబాబు అమరావతి, పోలవరం సహా పలు ప్రాజెక్టులు చేపట్టినా పూర్తిచేయలేక పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అనేక సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. అవేవీ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడలేదు. కానీ కాంట్రాక్టర్లకు, అధికార పార్టీల నాయకులకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. అందుకు పోలవరమే సాక్ష్యం.
అయితే, కేంద్ర అధికారులు ఆదిలోనే అడ్డువేసినట్లు వార్తలు వస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేంద్రమంత్రి పాటిల్ ప్రకటించారు. కార్పొరేట్ అనుకూల విధానాలు మోడీ మన్ననలు పొందుతాయేమోకానీ ప్రజల వ్యతిరేకతను పెంచడం కూడా ఖాయం. సత్వరం పోలవరం పూర్తి చేసి నిర్వాసితులను ఆదుకోవాలి. అలా చేయకుండా బనకచర్ల జపం చేయడం సరికాదు. కేంద్రం తనకు అనుకూలంగా ఉందని చంద్రబాబు అతి విశ్వాసానికి పోతే ప్రజల నుంచి భంగపాటు తప్పదు.

