బడ్జెట్ అంటే ఆదాయ, వ్యయాల పట్టిక మాత్రమే కాదు. భవిష్యత్తును నిర్ణయించే దిశానిర్దేశ ప్రణాళిక. కానీ, బడ్జెట్ అంటే కేవలం పన్నులు, రాయితీలు, కోతలు, కేటాయింపులుగా మారిపోయింది. బడ్జెట్ కేటాయింపుల్లో కామన్ మ్యాన్ కనిపించకుండా పోతున్నాడు. వృద్ధి శాతం, జీడీపీ అంచనాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు వినిపిస్తాయి. కానీ, నిరుద్యోగం, అప్పుల భారం, గిట్టుబాటు లేని రైతుల ఆత్మహత్యలు ఈ గణాంకాల్లో గల్లంతవుతున్నాయి.
దేశ భవితకు మూలం గ్రామీణ ఆర్థిక వ్యవస్థే. జనాభాలో 65% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. అయినా బడ్జెట్ కేటాయింపుల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు దక్కుతున్న ప్రాధాన్యం తక్కువే. వ్యవసాయాధారిత దేశంలో రైతులకు దిక్కులేకుండా పోతోంది.
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.33.8 లక్షల కోట్లకు చేరింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 66.7 శాతం. ఇందులో రెవెన్యూ వ్యయాలు రూ.25.93 లక్షల కోట్లు కాగా, పెట్టుబడి వ్యయాలు రూ.7.87 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఉత్పాదక పెట్టుబడుల కంటే నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి.
రెవెన్యూ వ్యయాల్లో వడ్డీ చెల్లింపులకే రూ.9.11 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఇది మొత్తం వ్యయాల్లో 27 శాతం. ప్రధాన రాయితీలకు రూ.3.17 లక్షల కోట్లు ఖర్చవుతున్నాయి. అప్పులపై అప్పులు చేసుసుకుంటూ, వాటికి వడ్డీలు చెల్లిస్తూ దేశం ఒక ఆర్థిక చక్రవ్యూహంలో చిక్కుకుంటోంది.
గతేడాది డిసెంబరు చివరి నాటికి ప్రభుత్వానికి రూ.25.25 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 72.2%. ఇందులో రూ.19.39 లక్షల కోట్లు పన్నుల ద్వారా, రూ.5.39 లక్షల కోట్లు పన్నేతర ఆదాయంగా సమకూరాయి. రుణ రహిత పెట్టుబడి సాధనాల ద్వారా రూ.46,047 కోట్లు వచ్చాయి. అంటే ఆదాయం ఉన్నప్పటికీ నియంత్రణలేని వ్యయాలే ద్రవ్యలోటును పెంచుతున్నాయి.
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 4.4 శాతంగా లేదా రూ.15.69 లక్షల కోట్లుగా అంచనా వేసింది. డిసెంబరు చివరి నాటికే ద్రవ్యలోటు రూ.8.55 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ఇది వార్షిక లక్ష్యంలో 54.5%. గతేడాది ఇదే సమయంలో ఇది 56.7 శాతంగా ఉంది. స్వల్ప మెరుగుదల కనిపించినా, అదుపులేని వ్యయం అలాగే ఉంది.
ఇందులో రాజకీయ నాయకుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, విమాన ప్రయాణాలు, నివాస సౌకర్యాలు రెవెన్యూ వ్యయాల్లో కీలకంగా మారాయి. గత ప్రభుత్వాలతో సహా, పదేళ్లుగా మోదీ కూడా పట్టించుకోవడం లేదు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్నప్పుడు, అధికార వర్గాల ఖర్చులపై నియంత్రణ ఎందుకు సాధ్యం కావడం లేదు?
మధ్యతరగతి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆదాయపు పన్ను స్లాబ్‌లు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుపై ఆశలు ఉన్నప్పటికీ, అదుపులేని ధరలు ఆ లాభాన్ని మింగేస్తోస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, బ్యాంకుల సేవా రుసుములు, క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, కనీస బ్యాలెన్స్ నిబంధనలు ప్రతి నెలా సామాన్యుడి ఖర్చులను పెంచుతున్నాయి.
బడ్జెట్ సంప్రదాయాల్లో మార్పులు వచ్చినా, దృక్పథంలో మార్పు రావడం లేదు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం విధాన పరంగా సరైన నిర్ణయమే. కానీ ఆ ముందస్తు బడ్జెట్ వల్ల పథకాలు వేగంగా అమలవుతున్నాయా? గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతోందా?
దేశం నిజంగా ఆర్థికంగా గట్టెక్కాలంటే కాకిలెక్కల కోలాహలం. గణాంకాల మాయాజాలం కాదు. కఠినమైన సంస్కరణలు అవసరం. వృథా ఖర్చులకు కత్తెర వేయాలి. రాజకీయ వ్యవస్థలో ఆర్థిక క్రమశిక్షణ రావాలి. ఉత్పాదక పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే బడ్జెట్ లెక్కల పద్దుగా కాకుండా, సామాన్యుడి జీవితాన్ని మార్చే సాధనంగా మారుతుంది.

