ఎన్నికలు రాజకీయ పార్టీలకు కేవలం ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రమే కాదు. అధికారాన్ని అధిష్టించడానికి, తమ బల ప్రదర్శనకు, భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించుకునే వేదిక. తెలంగాణలో ఇటీవల గ్రామ పంచాయితీల ఎన్నికలు ముగియగా, ఇప్పుడు పట్టణ ఎన్నికలకు తెరలేచింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పట్టణాలు, నగరాలు రాజకీయ రణక్షేత్రాలుగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు మరింత ఉధృతమవుతోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 16న మున్సిపల్ ఛైర్మన్‌లు, మేయర్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. ముఖ్యంగా అధికార పార్టీకి పట్టణాల్లో పట్టు నిలబెట్టుకోవడం ఒక పెద్ద సవాల్. కాగా, ప్రతిపక్షాలకు ఇది తమ ఉనికిని చాటుకునే అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో సాధించిన ఫలితాలను పట్టణాల్లో కూడా పునరావృతం చేయాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వంపై పట్టణ ఓటర్ల అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి.
గ్రామ పంచాయతీల్లాగే, మున్సిపల్ ఎన్నికలు కూడా స్థానిక సమస్యలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్, పట్టణ అభివృద్ధి వంటి అంశాలే ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, ఈ ఎన్నికలు రాష్ట్ర స్థాయి రాజకీయ బల నిరూపణకు కొలమానంగా మారుతున్నాయి. పట్టణాల్లో ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై గట్టి ప్రభావం చూపనున్నాయి.
నామినేషన్ల ఘట్టం మొదలవడంతో ఆశావహుల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. రిజర్వేషన్ల కారణంగా కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతుండగా, మరికొందరు పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ టికెట్ల కోసం అంతర్గత రాజకీయాలు, పైరవీలు జోరుగా సాగుతున్నాయి. అధికారిక నోటిఫికేషన్‌కు ముందే ఖర్చులు మొదలవడం, ఇప్పుడు నోటిఫికేషన్‌తో మరింతగా వ్యయాలు పెరగడం అభ్యర్థులకు ఆర్థిక భారంగా మారింది.
ప్రచారానికి కేవలం రెండు వారాలే సమయం ఉండటం ఒకవైపు మంచిదే అయినప్పటికీ, తక్కువ సమయంలో ఓటర్లను ప్రభావితం చేయాలనే తొందరలో అనవసర హంగులు, ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పథకాలు, హామీలు కీలకంగా మారనున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలతో అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే మొదలైంది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒకే రోజు పోలింగ్, ఒకే రోజు లెక్కింపు ద్వారా ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించడం ద్వారా అనవసర ఉద్రిక్తతలకు తావు లేకుండా చూసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలన్న ఎన్నికల కమిషన్ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాల్సిందే.

