ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే అమెరికా ఆకాంక్ష కొత్తదేమీ కాదు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆ ఆకాంక్ష మరింత దుర్నీతిగా, దుందుడుకుగా మారింది. ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. సుంకాలు, ఆర్థిక ఆంక్షలు, దౌత్య బెదిరింపులు, సైనిక దాడులు వంటి వ్యూహాలతో ట్రంప్ అనేక దేశాల్లో అస్థిరతకు కారణమవుతున్నారు. పైకి స్నేహహస్తం చాస్తూనే లోపల ధృతరాష్ట్ర కౌగిలిని బిగించడం అమెరికా విదేశాంగ విధానంగా మారింది.
వెనెజువెలా మొదలు ఇరాన్ వరకు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇరాక్ వంటి దేశాల్లో అంతర్గత కలహాలకు అమెరికా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆజ్యం పోసింది. సీఐఏ పాత్ర, ఇటీవలి పరిణామాలు రూఢీ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ పేరుతో మొదలయ్యే అమెరికా జోక్యం, చివరికి ఆయా దేశాల్లో రాజకీయ అరాచకతకు దారితీస్తోందన్నది చేదు నిజం.
ఇరాన్ తాజా పరిణామాలు, ఆర్థిక సంక్షోభ నిరసనలతో మొదలై, క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి. అమెరికా విధించిన చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ వాణిజ్య పరిమితులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరానియన్ రియాల్ విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40 శాతాన్ని దాటింది. ఆహారం, ఇంధన ధరలు సామాన్య ప్రజల జీవనాన్ని అసాధ్యంగా మార్చాయి.
ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆగ్రహాన్ని తమ ప్రయోజనాలకు మలచుకోవాలని అమెరికా ప్రయత్నించింది. నిరసనకారులను బహిరంగంగా ప్రోత్సహించింది. ఇరాన్ ప్రభుత్వాన్ని పదేపదే హెచ్చరించింది. సైనిక దాడుల సంకేతాలు ఇచ్చింది. ఇవి ఆ దేశంలో అనిశ్చితిని మరింత పెంచాయి. ఒక దశలో టెహ్రాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధపడింది. పశ్చిమాసియాలోని అమెరికా వైమానిక స్థావరాల్లో కదలికలు, బలగాల ఉపసంహరణలు యుద్ధ మేఘాలను కమ్మేశాయి.
అయితే చివరి నిమిషంలో వ్యూహాత్మక కారణాలతో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్‌పై దాడి చేస్తే అది పరిమిత స్థాయిలో ఆగదని, దీర్ఘకాలిక యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్ అంత తేలికగా లొంగదని ట్రంప్‌కు హితవు పలికినట్లు సమాచారం. సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, ఈజిప్టు వంటి గల్ఫ్ మిత్రదేశాలు కూడా యుద్ధానికి వ్యతిరేకంగా దౌత్యం చేశాయి. యుద్ధం జరిగితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించాయి.
నిరసనకారుడు ఎర్ఫాన్ సొల్తానీకి విధించిన మరణశిక్షను ఇరాన్, చివరి క్షణంలో నిలిపివేయడం కూడా ట్రంప్ వెనక్కి తగ్గేందుకు ఆస్కారమిచ్చింది. దీన్ని మానవ హక్కుల విజయంగా అమెరికా అభివర్ణించినా, వాస్తవానికి అది రాజకీయ నిర్ణయమేనని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సైనిక దాడి లేకుండానే ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగించవచ్చన్న భావన ట్రంప్‌లో బలపడింది.
ఇక ఇరాన్‌లో పరిస్థితులు ఇప్పటికిప్పుడు అదుపులోకి వచ్చేలాలేదు. 31 ప్రావిన్సులన్నింటిలోనూ నిరసనలు చెలరేగడం, వందలాది నగరాల్లో ఆందోళనలు జరగడం, వందల మంది మరణాలు, వేలాది అరెస్టులు ఆ దేశం ఎంత తీవ్రమైన సంక్షోభంలో ఉందో అర్థం చేస్తున్నాయి. సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్‌ఔట్, పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. భద్రతా బలగాల కఠిన చర్యలు, ఉరిశిక్షల బెదిరింపులు ప్రజల్లో భయాందోనళనల్ని పెంచుతున్నాయి.
అమెరికా దౌత్యం అస్థిరతను ఆయుధంగా మలచుకుంటోంది. ప్రజాస్వామ్యం పేరుతో జోక్యం చేసుకుంటూ, ఆయా దేశాల అంతర్గత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇరాన్ మాత్రమే కాదు, భారత్ సహా అనేక దేశాలు ఇలాంటి ప్రయత్నాల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. మణిపూర్ అల్లర్లు, రైతు ఉద్యమాలు, సరిహద్దు ఉద్రిక్తతలు వంటి పరిణామాలను కూడా ఈ విస్తృత వ్యూహంలో భాగమేనా? అన్న అనుమానాలు కలగక మానవు.
అయితే, ఇరాన్ ఎదుర్కొంటున్న సంక్షోభానికి కేవలం అమెరికా జోక్యమే కారణమనలేం. అక్కడి ఛాందస పాలన, రాజకీయ దమనమే ప్రజల ఆగ్రహానికి మూలకారణం. కానీ ఆ అసంతృప్తిని అమెరికా, తమ స్వార్థానికి వాడుకోవడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. ఇరాన్ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే అంతర్గత సంస్కరణలు, రాజకీయ చర్చలు, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే ప్రయత్నాలు తప్పనిసరి. అదే సమయంలో ప్రపంచం మొత్తం కూడా అమెరికా విధానాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక దేశంలో మొదలైన చిచ్చు, చివరికి ప్రపంచాన్నే కాల్చే కార్చిచ్చు అయ్యే ప్రమాదం లేకపోలేదు. తస్మాత్ జాగ్రత్త!

