ప్రకృతి మనకేకాదు, మొత్తం ప్రాణ కోటికి జీవాధారం. గాలి, నీరు, నేల, అడవులు అన్నీ సమతుల్యంగా ఉంటేనే మనుగడ సాధ్యమవుతుంది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నిర్లక్ష్యం చేయడం, దోపిడీ చేయడం, నాశనం చేయడం వల్ల పర్యావరణ విధ్వంసం వేగంగా పెరుగుతోంది. వాతావరణ మార్పులు, నీటి కొరత, జీవ వైవిధ్య నష్టం వంటి సమస్యలు విలయ తాండవం చేస్తాయి. ఈ సమస్య ఇప్పుడు భవిష్యత్తు కాదు, ప్రస్తుతమే. ఈ పరిస్థితికి ప్రత్యక్ష ఉదాహరణ భారతదేశంలోని ఆరావళి పర్వత శ్రేణులు.
ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణుల శ్రేణికి చెందినవి ఆరావళి పర్వతాలు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వీటి వయస్సు దాదాపు 150 కోట్ల నుంచి 250 కోట్ల సంవత్సరాలు. గుజరాత్ నుంచి రాజస్థాన్ మీదుగా హర్యానా, ఢిల్లీ వరకు 800 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఈ పర్వతాలు ఆప్రాతాన్ని ఎడారులు కాకుండా అడ్డుకోవడం, వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాలను అడుగంటకుండా చేయడం సహా మొత్తం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలకంగా ఉన్నాయి.
కానీ నేడు ఆరావళి తీవ్ర సంక్షోభంలో ఉంది. గత కొన్ని దశాబ్దాల్లో విచక్షణ రహితంగా అక్రమ గనుల తవ్వకం, అడవులు నరకడం, పట్టణీకరణ వల్ల ఈ పర్వత శ్రేణులు వేగంగా క్షీణిస్తున్నాయి. అధికారిక నివేదికల ప్రకారం, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో ఆరావళి అటవీ విస్తీర్ణంలో 30 నుంచి 40 శాతం వరకు తరిగిపోయాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆరావళికి చెందిన సహజ కొండలలో 25 శాతం కంటే ఎక్కువగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయని సూచిస్తున్నాయి.
ఈ విధ్వంసం ప్రభావాలు తీవ్రంగా ఉన్నాయి. ఆరావళి క్షీణత వల్ల పశ్చిమ రాజస్థాన్ ఎడారీగా మారుతోంది. ఒక అంచనా ప్రకారం, ఆరావళి బలహీనత కారణంగా థార్ ఎడారి ప్రతి సంవత్సరం తూర్పు దిశగా అర కిలోమీటర్ నుండి ఒక కిలోమీటర్ వరకు విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఈ పర్వతాలు వర్షపు నీటిని నేలలోకి చొప్పించడంలో కీలకమైనవి. అవి దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. భూమిలో నీటి మట్టాలు పడిపోతాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూగర్భ జల మట్టాలు కొన్ని చోట్ల ప్రతి ఏడాది ఒక మీటరు కంటే ఎక్కువగా పడిపోవడం దీనికి నిదర్శనం.
జీవ వైవిధ్య పరిరక్షణ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు చిరుతలు, నీలగాయిలు, నక్కలు, అనేక పక్షి జాతులతో కళకళలాడిన ఆరావళి అరణ్యాలు ఇప్పుడు కాంక్రీట్ నిర్మాణాలు, రహదారులు, గనుల గోతులతో నిండిపోయాయి. భారతదేశంలో నమోదైన సుమారు 45వేల వృక్ష జాతుల్లో అనేక అరుదైన మొక్కలు ఆరావళికి ప్రత్యేకమైనవి. వాటి నివాసం నశిస్తే జాతుల అంతరించిపోవడం తప్పదు.
ఈ పరిస్థితి మనకు ఒక స్పష్టమైన సందేశాన్నిస్తోంది. ప్రకృతిని ధ్వంసం చేస్తూ అభివృద్ధి సాధించలేం. తక్షణ లాభాల కోసం పర్వతాలను పేల్చడం, పచ్చని అరణ్యాలను పిచ్చిగా నరకడం చివరికి మన మనుగడకే ముప్పు. ఆరావళి పరిరక్షణ కోసం అక్రమ గనులను కఠినంగా నియంత్రించడం, తిరిగి అడవులను పెంచడం, స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పాలక వర్గాలు, ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్థిరమైన అభివృద్ధి నమూనాలు అమలు చేయడం అత్యవసరం.
ప్రకృతి మనకు మాత్రమే వారసత్వం కాదు. అది భవిష్యత్ తరాలకు అందించాల్సిన వారసత్వ సంపద కూడా. దాన్ని బాధ్యతగా అందించాల్సిన సమయం ఇది. ఆరావళి పర్వతాల రక్షణ అంటే కేవలం ఒక పర్వత శ్రేణి రక్షణ కాదు. అది మన నీరు, గాలి, వాతావరణం, మొత్తం ప్రకృతి, జీవన భద్రతను కాపాడుకోవడమే. ఇప్పుడు మేల్కొనకపోతే, రేపు పశ్చాత్తాప పడటానికి కూడా మనం మిగలం.

