భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ పారదర్శక ఎన్నికలు. ఇది రాజకీయాలతో కూడిన సున్నిత అంశం. అయితే, ‘ఎన్నికల సంస్కరణల’పై పార్లమెంటులో జరుగుతున్న చర్చ రాజకీయ రచ్చగా మారిపోయింది. పాలక బీజేపీ, ఎన్డీఏ పూర్తి స్థాయి సంస్కరణల ముసాయిదా ప్రకటించకపోవడం ఒక సమస్య కాగా, ఆ ముసాయిదానేగాక, ఎన్నికల పాదర్శకతపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అధికార, విపక్ష కూటములు రాజకీయ ఎజెండాలకే ప్రాధాన్యమివ్వడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలం అవుతున్నది.
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ పారదర్శక ఎన్నికలు. ఇది రాజకీయాలతో కూడిన సున్నిత అంశం. అయితే, ‘ఎన్నికల సంస్కరణల’పై పార్లమెంటులో జరుగుతున్న చర్చ రాజకీయ రచ్చగా మారిపోయింది. పాలక బీజేపీ, ఎన్డీఏ పూర్తి స్థాయి సంస్కరణల ముసాయిదా ప్రకటించకపోవడం ఒక సమస్య కాగా, ఆ ముసాయిదానేగాక, ఎన్నికల పాదర్శకతపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అధికార, విపక్ష కూటములు రాజకీయ ఎజెండాలకే ప్రాధాన్యమివ్వడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలం అవుతున్నది.
“ఎన్నికల పారదర్శకత, ఖర్చుల నియంత్రణ, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం” ప్రతిపాదిక సంస్కరణల లక్ష్యమని పాలకపార్టీ పేర్కొంటోంది. ఓటర్ల జాబితాల సమీక్ష, డిజిటల్ ధృవీకరణ, పార్టీ నిధులపై పర్యవేక్షణ వంటి అంశాలను ఇది ముందుకు తెచ్చింది. ప్రభుత్వం దీన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని బలపరిచే “సిస్టమ్ అప్‌గ్రేడ్”గా అభివర్ణించింది. అయితే ప్రతిపక్షం, ఈ సంస్కరణల వెనుక రాజకీయ లాభనష్టాల ‘హిడెన్ ఎజెండా’ దాగి ఉందని అనుమానిస్తోంది.
ప్రతిపక్షం ముఖ్యంగా రెండు అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒకటి, ఈ సంస్కరణలు ఓటర్ల గోప్యతను ప్రభావితం చేస్తాయా? రెండవది, ఇవి అధికార వ్యవస్థకే ఎక్కువ నియంత్రణను అందిస్తాయా? ప్రత్యేకంగా, డిజిటల్ ధృవీకరణ ప్రక్రియలో ఆడిట్, పారదర్శకత లేకుంటే, అధికార యంత్రాంగం ఎన్నికలపై పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. పాలకపక్షం దీనిని “అసత్య ప్రచారం”గా కొట్టి పారేసినా, చర్చలో ఈ అనుమానం ప్రధాన బిందువుగా నిలిచింది.
ఈ వాదోపవాదాలు రాజకీయ భిన్నాభిప్రాయాలకు బలం చేకూర్చాయి. చిన్న పార్టీల నుండి వచ్చిన ప్రతిస్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. పెద్ద పార్టీల రాజకీయ సమీకరణల్లో తాము అడుగంటిపోతామనే ఆందోళనతో వారు ఈ సంస్కరణలను మళ్లీ సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలకు, కేంద్ర ఎన్నికల సంస్కరణ అంటే ఎప్పుడూ భయమే. అయితే, వారు పాలకపక్షంతో నేరుగా విభేదించకపోయినా, బలహీన ప్రతిపక్షాలపై సానుభూతి వ్యక్తం చేస్తూ, తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ చర్చలో మరో ముఖ్యాంశం రాజకీయ నిధులు. నిధుల వ్యవస్థను పారదర్శకంగా మారుస్తామని పాలకపక్షం చెప్పినా, ప్రతిపక్షం మాత్రం ఇది కొన్ని పెద్ద కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అనుకూలంగా మారుతుందని విమర్శిస్తోంది. నిధులపై పారదర్శకత వెనుక రాజకీయ, ఆర్థిక సమీకరణలు దాగి ఉన్నాయన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది. దీనిపై సమగ్ర చర్చ లేకపోవడం, విషయాన్ని మరింత అనుమానాస్పదంగా మార్చింది.
ఇక, ఎన్నికల్లో ధన ప్రవాహం, రాజకీయాలు, ఎన్నికలు ఖరీదైనవిగా మారడం, వంశపారంపర్యం, జీవితాంతం కొందరు చట్టసభల్లో తిష్ట వేయడం, దొంగ ఓట్లు, ఓట్లకు నోట్లు వంటి అంశాలను చర్చించి, సంస్కరించాల్సి ఉంది.
‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’పై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడం ఆందోళనకరం. వరుస ఎన్నికలు ప్రజలకు, ప్రభుత్వాలకు, యంత్రాంగానికి, భారంగా మారుతున్నాయి. జన గణన, కులగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్లు కూడా తప్పనిసరి. పక్కాగా ఓటర్ల జాబితా, ఎప్పటికప్పుడు సవరణలు అవసరం, అన్నింటికంటే ఎన్నికల సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమేగాక, స్వతంత్రంగా తీర్చిదిద్దాలి.
ఎన్నికల్లో రెండు పర్యాయాలకంటే మించి పోటీ చేసే అవకాశం లేకుండా చేయడం, ఎన్నికల్లో ధనబలం, కండబలం ప్రభావం తగ్గించేందుకు చట్టాలను బలోపేతం చేయడం అత్యవసరం. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల వ్యవస్థకు పటిష్ఠమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన బాధ్యతను పార్లమెంటు నిర్వర్తించాలి.
పేదలకు చట్టసభల్లో ప్రవేశం లభించేలా విధి, విధానాలు, ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం వంటి విస్తృత మార్పులు దేశ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తాయి. నిరంతరం కొత్త నాయకులు ఎన్నికవుతేనే అవినీతి, బంధుప్రీతి, కొన్ని వర్గాల పాలన, ఏకస్వామ్యం, నిరంకుశ రాజకీయాలు అంతమవుతాయి. ఓటు వేసే బాధ్యతను తప్పనిసరి చేయడం, ఓటు వేయని వారిపై చర్యలు తీసుకోవడం కూడా చర్చించదగిన అంశాలు. అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కలిగిన ఎన్నికల విధానం ఉంటేనే భారతదేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.

