భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే ఎన్నికల వ్యవస్థ పటిష్టంగా, పారదర్శకంగా, ప్రజాప్రయోజనాలను కాపాడే విధంగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ, నిధుల వ్యయం, దోపిడీ రాజకీయాలు, ఓటర్ల ఆకర్షణ కోసం జరుగుతున్న అక్రమాలు, రాజకీయాల్లో క్రిమినల్ చొరబాటు, క్రిమినల్సే అభ్యర్థులు కావడం వంటి అనేక సమస్యలు ప్రజాస్వామ్య ఉనికినే దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సమగ్ర ఎన్నికల సంస్కరణలపై భారత పార్లమెంట్‌లో పార్టీల రాజకీయాలకు అతీతమైన అర్థవంతమైన నిష్పాక్షిక సీరియస్ చర్చ జరగడం అత్యవసరం.
దేశంలో ఎన్నికలు నిర్వహణలో తలెత్తుతున్న ప్రధాన సమస్యల్లో మొదటిది అత్యధిక ఎన్నికల వ్యయం. ఖర్చుల నియంత్రణకు నిబంధనలు ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. నల్ల ధనం ప్రవాహం ఎన్నికల వ్యవస్థను భయంకరంగా దెబ్బతీస్తోంది. ఎన్నికల నిధుల పారదర్శకత కోసం రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల పద్ధతిని పూర్తిగా ప్రజలకు తెలిసేలా చేయాలి. కార్పొరేట్ ఫండింగ్‌పై కఠిన నియంత్రణలు విధించాలి. ఇదంతా పటిష్టమైన చట్టాల రూపకల్పన ద్వారానే సాధ్యం. ఈ అంశంపై గతంలో ఎన్నో కమిటీలు సూచనలు ఇచ్చినా అమలు మాత్రం జరగలేదు. దీనిపై పార్లమెంట్‌లో లోతైన చర్చతో పాటు ఆచరణాత్మక నిర్ణయాలు తప్పనిసరిగా రావాలి.
మరో ప్రధాన సమస్య రాజకీయాల్లో నేర చరితులు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఎన్నికల రాజకీయాల్లో రోజురోజుకు పెరుగుతున్నారు. రాజకీయాలను, పార్టీలను, ప్రభుత్వాలను వారే శాసిస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే చర్యలు తీసుకోవాలి. ‘తప్పు నిరూపించబడే వరకు నిర్దోషి’ అనే చట్టపరమైన న్యాయ సూత్రం ఉన్నా, తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్న వ్యక్తులు శాసన, చట్ట సభల్లో ఉండటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఈ అంశంపై కూడా పార్లమెంటులో అఖిలపక్ష చర్చ జరగాలి.
ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, తప్పిదరహితంగా మార్చడానికి ఏం చేయాలనేది? బ్యాలెట్ పద్ధతా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగమా? వీటిపై ఏకాభిప్రాయ సాధన అవసరం. అధికారంలో ఉన్న పార్టీలపై, విపక్షాలు ఓడిన ప్రతిసారీ ఓటింగ్ యంత్రాలపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. గెలుపోటములు మారినా, ఓడిన వారి పద్ధతి మారడం లేదు. అంటే ట్యాంపరింగ్ కు నిజంగా అవకాశం ఉందా? లేదా? ఉంటే గనక ఈవీఎంల వినియోగం ఎందుకు? ఒకవేళ ఆ అనుమానాలే ఉంటే, తొలగించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? ప్రతిపక్షం ఈవీఎంలపై అభ్యంతరాలు లేవనెత్తితే, వాటినే వినియోగించాలనడంలో అధికార పార్టీ ఔచిత్యమెంత? దీనిపై చర్చ జరగడమే కాదు. భవిష్యత్తులో అనుమానాలకే తావులేని, ఓ నిర్ణయం తీసుకోవడం అందరికీ, ముఖ్యంగా ప్రజాస్వామ్య మనుగడకు మంచిది.
వీటితోపాటు ఓటర్ల జాబితాలు తప్పులు లేకుండా ఉండటం, ఓటర్లకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యం. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, అబద్ధ ప్రచారం, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటి సమస్యలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతున్నందున, వీటిని నియంత్రించే విధానాలు కూడా రూపుదిద్దాలి.
ప్రతి ఎన్నిక తర్వాత వ్యవస్థలోని లోపాలను చర్చించడమే కాకుండా, వాటిని సరిదిద్దాలి. ఎన్నికల కమిషన్‌కు మరింత స్వతంత్రత, ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఇవ్వడంపై కూడా చర్చించాలి.
భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఎన్నికల వ్యవస్థ బలోపేతంపై ఆధారపడి ఉంది. ఇది కేవలం రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు, దేశంలోని ప్రతి ఓటరు హక్కును కాపాడేందుకు అవసరమైన చర్య. కాబట్టి సమగ్ర ఎన్నికల సంస్కరణలపై భారత పార్లమెంట్‌లో సమగ్రమైన, బాధ్యతాయుతమైన చర్చ జరగడం అనివార్యం. మరి ఈ దిశగా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయా? చర్చిస్తాయా?

