మొంథా బీభత్సాన్ని మరకవ ముందే మరో తుఫాన్ దిత్వాహ్ దూసుకువస్తోంది. పెను బీభత్సం పొంచివుంది. అది ఎంతటి నష్టాన్ని కలిగిస్తోందో? ఎన్ని ప్రాణాలను బలితీసుకుంటుందో? ప్రజలు ఎన్ని కష్టనష్టాలకు ఓర్వాల్సి వస్తుందో? ఏయే ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందో? తుఫాన్ అంటే చాలు ప్రజలు, ప్రభుత్వాలు, ప్రత్యేకించి రైతులు వణికిపోతున్నారు. ముందు జాగ్రత్త, నష్ట నివారణే తప్ప తుఫాన్లను ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదు. చివరకు ప్రభుత్వాలకు కూడా. ప్రకృతి ప్రకోపిస్తే గడ్డి పోచలా తల వంచడమే తప్ప, చేయగలిగిందేమీ లేదు. ఇది మన, మన ప్రజల, రైతుల అనుభవ సారం.
అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టిలు, తుఫాన్లు రైతుల పాలిట శాపంగా మారాయి. సమయానుకూల వర్షాలే లేకుండా పోయాయి. ఆలస్యంగా లేదా ముందుగానే వర్షాలు పడుతున్నాయి. మన దేశంలో పంటలన్నీ దాదాపు వర్షాధారమే. దీంతో సాగు సమస్యగా మారి, రైతుల సావుకు వస్తున్నది. నష్ట నివారణ సాధ్యం కాదు. కానీ, నష్ట పరిహారం కూడా అందక రైతులు దిగాలుగా దివాళా తీస్తున్నారు. పంటలకు నేటికీ బీమా లేకపోవడం కూడా రైతులకు శాపంగా మారింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అన్నమో రామచంద్రా అంటూ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తీరప్రాంతాలు ప్రకృతి విపత్తులకు శాశ్వత కేంద్రాలుగా మారాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులతో పాటు వివిధ వృత్తులపై ఆధారపడే లక్షలాది మంది ప్రతి ఏటా ఏదో రకంగా నష్టపోతూనే ఉన్నారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా సహజ విపత్తుల కడలిలో ఆయా ప్రజలు మనుగడ సాగించక తప్పని స్థితి దాపురించింది. ఈ ఏడాది ఇంతకుమందు విరుచుకుపడిన మొంథా తుఫాన్ తీరని నష్టాన్నే మిగిల్చింది. పెరిగిన సాంకేతికత ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించినప్పటికీ, పంట నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. పైగా వాతావరణ మార్పుల కారణంగా విపత్తుల తీరు కూడా మారింది. ఊహించని చోట, ఊహించని విధంగా క్లౌడ్ బరస్ట్ జరిగి, గంటల తరబడి కుండపోతగా వర్షం కురవడం, వాగులు, వంకలు పొంగి అనూహ్య వరదలు చోటు చేసుకోవడం, విపరీతమైన వేగంతో గాలి వీచడం వంటి వైపరీత్యాలు సాధారణంగా మారుతున్నాయి. దీంతో నష్టం భారీగా పెరుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
నిజానికి మొంథా తుపాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏపీలోని 443 మండలాల్లో 3,109 గ్రామాలు తుఫాన్ బారినపడ్డాయి. 10 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1.11 లక్షల మంది నిరాశ్రయులైనారు. 1.61 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగి, 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టమూ ఉంది. మొంథా తుఫాన్ కారణంగా రూ.6,384 కోట్ల రూపాయల నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రభుత్వ లెక్కల మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది వేరే విషయం.
కేంద్ర సాయం ఇంకా రాష్ట్రానికి అందని ఈ సమయంలో మరో తుఫాన్ హెచ్చరిక మూలిగే నక్కపైన తాటి పండు పడ్డట్లుగానే ఉన్నది. ఈ నేపథ్యంలో విపత్తు అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వం వేగంగా, ఉదారంగా స్పందించాలి. హుద్‌హుద్ తుఫాన్ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి.
అదే సమయంలో రాష్ట్రం పూర్తిగా కేంద్రంపై మాత్రమే ఆధారపడ కూడదు. నష్ట పరిహారానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే, రాష్ట్ర పరంగా అన్నింటికీ సంసిద్ధం కావాలి. విపత్తుల నివారణ, తక్షణ సహాయానికి ప్రత్యేక నిధిని సిద్ధంగా ఉంచాలి. ఆ నిధిని పరిహారంగా బాధిత ప్రజలకు అందేలా చూడాలి. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతూనే, ప్రజల్లో చైతన్యం కలిగించి, విపత్తుల నివారణకు పూనుకోవాలి. వైపరీత్యాలపై కూడా ప్రజలకు ప్రభుత్వం ఉందన్న భరోసానివ్వాలి.

