కులతత్వ, ముస్లిం లీగ్-మావోయిస్టు భావజాలాన్ని బిహార్ ప్రజలు తిరస్కరించారా? ఇందిర, రాజీవ్ లతో పని చేసిన సీనియర్లు కూడా రాహుల్ విన్యాసాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? మిత్ర పక్షాలు, పార్టీ కార్యకర్తలకు కూడా వివరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదా? అవుననే ప్రదాని మోదీ అంటున్నారు. సూరత్ లో స్థిరపడిన బిహారీలతో సమావేశంలో ఆయన సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు వరస ఓటములపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మరి కాంగ్రెస్ లో ఆ ఆత్మపరిశీలన, అంతర్మథనం జరుగుతోందా?
కులతత్వ, ముస్లిం లీగ్-మావోయిస్టు భావజాలాన్ని బిహార్ ప్రజలు తిరస్కరించారా? ఇందిర, రాజీవ్ లతో పని చేసిన సీనియర్లు కూడా రాహుల్ విన్యాసాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? మిత్ర పక్షాలు, పార్టీ కార్యకర్తలకు కూడా వివరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదా? అవుననే ప్రదాని మోదీ అంటున్నారు. సూరత్ లో స్థిరపడిన బిహారీలతో సమావేశంలో ఆయన సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు వరస ఓటములపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మరి కాంగ్రెస్ లో ఆ ఆత్మపరిశీలన, అంతర్మథనం జరుగుతోందా?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్షం పట్ల ప్రజల విముఖత ప్రతిబింబించింది. అధికార కూటమికి 202 సీట్లు రాగా, ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్‌కు కేవలం 35 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ప్రజాతీర్పును రాహుల్, ఎన్నికల ప్రక్రియ మొత్తం తప్పుగా సాగిందంటున్నారు. ఏకపక్ష ప్రజా తీర్పులో కాంగ్రెస్ కూటమి పెద్దగా కనిపించకుండా కొట్టుకుపోయింది. నితీశ్ ను నిలువరించే ఒక్క ప్రజా వ్యతిరేకత కనిపించలేదు. జన్ సురాజ్ ప్రశాంత్ కిశోర్ ఉనికే కనిపించలేదు.
ఓట్ చోరీ, నిరుద్యోగితకే పరమితమైన రాహుల్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, లేదా ప్రజాభిమానాన్ని చూరగొనే ఒక్క అంశాన్నీ ప్రస్థావించలేకపోయారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలలో బిహారీల తీరుతెన్నులకు ఎవరూ సహేతుకమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. బిహార్ ప్రజల ప్రత్యామ్నాయ దార్శనికతతో ఉత్తేజితులను చేయడంలో, మార్పునకై ఒక ప్రగాఢ ఆకాంక్షను వారి మనసుల్లో పురికొల్పడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. ఓటర్లను బూత్ ల వరకు తీసుకువచ్చే సంస్థాగత వెన్నుదన్ను కూడా మహగఠ్ బంధన్ కు కరువైంది. ఎన్నికల వేళ బిహార్‌లో మాత్రమే ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ -సర్ ని చేపట్టి బీజేపీ విజయవంతమైంది.
బిహార్ ఎన్నికల్లో నితీశ్ గత పాలనతోపాటు, తాజాగా ఇచ్చిన హామీలు ఎన్డీఎ కూటమిని విజయతీరాలకు చేర్చింది. ఎన్నికలకు ముందు ఆగస్టు 29న నితీశ్ సర్కార్ ప్రకటించిన ’ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ గేమ్ చేంజర్‌గా నిలిచింది. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు వ్యాపారం చేసుకోవడానికి సీడ్‌మనీ కింద రూ.10 వేలు చొప్పున పంపిణీ చేశారు. 1.4 కోట్ల మంది బిహారీ మహిళలకు ఈ సొమ్ము సరిగ్గా ఎన్నికలకు ముందు అందింది. బాలికలకు ఉచిత విద్య, సైకిళ్లు, యూనిఫారాలు, వితంతు పింఛన్ల పెంపు వంటి పథకాలు మహిళల్ని బాగా ఆకర్షించాయి.
ముస్లింలు, యాదవుల-ఎంవై- ఓట్లపై కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నమ్మకంగా ఉంటే, ఆ వర్గాల మహిళల్ని కూడా ఎన్డీయే ఆకట్టుకుంది. బీజేపీ సంప్రదాయ అగ్రకులాలవారి ఓట్లపై దృష్టి సారించగా, జేడీయూ కుర్మీలు, ఈబీసీల ఓట్లపై దృష్టి సారించింది. కూటమిలోని లోక్‌జనశక్తి, రాష్టీయ్ర లోక్ మోర్చా, హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీలు దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లను రాబట్టడంలో కీలకపాత్ర పోషించాయి. సీమాంచల్ ప్రాంతంలో ముస్లింల ఓట్లు అత్యధికంగా మజ్లిస్ పార్టీకే పడ్డాయి. ముస్లిం ఓట్లలో చీలిక.. మహాగఠ్‌బంధన్ కు బలమైన పట్టున్న ప్రాంతాల్లో కూడా ఓటమికి కారణమైంది. ఆర్జేడీకి కోర్ ఓట్ బ్యాంకు అయిన యాదవుల ఓట్లు సైతం ఈసారి చీలిపోయాయి.
బిహార్ ఓటర్లు మరచిపోయినా, బీజేపీ ఆర్జేడీ జంగిల్‌రాజ్ పాలనను పదే పదే గుర్తు చేసింది. బిహారీల పట్ట బయటి ప్రపంచానికి చిన్నచూపు ఉండేది, నితీశ్ పాలనతో ఆ మరక పోయి, బిహార్‌ను గౌరవంగా చూస్తున్నారనే భావన చాలా మంది బిహారీల్లో కలిగింది.
ఎప్పటిలాగానే బిహార్‌లో మోదీ మ్యాజిక్ కొనసాగింది. ఆయన సభలు, సంక్షేమ పథకాలు, తటస్థ ఓటర్లను ఎన్డీఎ తమ వైపు తిప్పుకోగలిగింది. చొరబాటుదారులకు ఆర్జేడీ కాంగ్రెస్ మద్దతునిస్తున్నాయని, ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దోచుకుతిన్నాయని, ఆటవిక పాలన కొనసాగించాయని పదేపదే గుర్తు చేసి సక్సెస్ అయ్యారు.
ఇలాంటి అనేక అంశాలు బిహార్ ఓటర్లపై ప్రభావాన్ని చూపాయి. స్వీయ ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్, ప్రజల్లో పట్టున్న పార్టీలను పట్టుకోవడంలోనూ విఫలమవుతోంది. మరి ఇవన్నీ విశ్లేషించుకుని, తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించకునే అంతర్మథనం కాంగ్రెస్ లో, రాహుల్ లో జరిగితేనే రాజకీయ భవితవ్యం ఉంటుంది.

