భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నమోదైన ఓటర్లు 96.88 కోట్ల మంది. అంతకుముందు ఎన్నికలకు నమోదైన ఓటర్లతో పోలిస్తే 8% పెరుగుదల ఉంది. మహిళా ఓటర్ల నమోదు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల 2 కోట్ల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణలు అవసరమా? లేదా? అన్నది ఈ మధ్య వివాదాంశంగా మారింది. బిహార్ ఎన్నికలకు ముందు సవరింపులు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సవరింపులతో ముడిపడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు వసరణను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఏకంగా తీర్మానమే చేసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణ అవసరమా? కాదా?
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నమోదైన ఓటర్లు 96.88 కోట్ల మంది. అంతకుముందు ఎన్నికలకు నమోదైన ఓటర్లతో పోలిస్తే 8% పెరుగుదల ఉంది. మహిళా ఓటర్ల నమోదు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల 2 కోట్ల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణలు అవసరమా? లేదా? అన్నది ఈ మధ్య వివాదాంశంగా మారింది. బిహార్ ఎన్నికలకు ముందు సవరింపులు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సవరింపులతో ముడిపడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు వసరణను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఏకంగా తీర్మానమే చేసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణ అవసరమా? కాదా?
దేశంలో ఉద్యోగ, ఉపాధి వలసలు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఓట్లు ఒకచోట, వారొక చోట ఉండటమో, లేదా రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటమో చేస్తున్నారు. ఓటే లేకుండా పోవడమో జరుగుతోంది. చిరునామా మార్చులు, మరణించినవారి పేరు తొలగించకపోవడం లాంటి కారణాల వల్ల జాబితా మార్పులు అవసరం అవుతాయి. భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్లు ‘ఒకసారి తయారైన ఓటర్ల జాబితాను ఎప్పటికి అలాగే కొనసాగించలేం. అందుకే సవరణ అవసరం’. భద్రతా ప్రమాణాల రీత్యా, రిప్రజెంటేసన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 16 ప్రకారం ‘కేవలం భారత పౌరులు, 18 ఏళ్ళు నిండిన వారు ఓటర్లుగా నమోదు కావచ్చు’.
అయితే, సాంకేతికత, సమాచారం, డిజిటలైజేషన్ పెరిగిన ఈ తరుణంలో ఆధార్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులను అత్యంత భద్రతగా ఇవ్వాల్సి ఉంది. కానీ, నకిలీ గుర్తింపు కార్డులున్నట్లుగా గుర్తించారు. ఓటర్ల రిజిస్ట్రేషన్, జాబితా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలంటే, సవరణలు తప్పనిసరి.
అయితే వసరణల్లో లోపాలే సవరణ ఎందుకు? అన్న ప్రశ్నలను సంధిస్తున్నాయి. హడావుడిగా ఎన్నికలకు ముందే ఈ సవరణలు చేపట్టడం వల్ల అనుమానాలు కలుగుతున్నయి. నిర్ణీత పద్ధతులు, సమయాల్లో నిరంతరంగా జరగాల్సిన సవరణపై సుప్రీం కోర్టు కూడా ఈసీని మందలించింది. ఇందుకు తగ్గట్లుగానే, వసరణల్లో లోపాలు, నిర్లక్ష్యాలు, ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. డాక్యుమెంటేషన్ పద్ధతి వల్ల నిరక్షరాస్యులైన ఓటర్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పరిమిత వనరులతో తక్కువ సమయంలో చేపట్టే సవరణలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
దేశ అత్యున్నత న్యాస్థానం చెబుతున్నట్లు.. ఇలాంటి అనుమానాలకు తావులేకుండా ఓటర్ల జాబితా సవరణలు నిరంతరంగా పారదర్శకంగా జరగాలి. సవరణ సులభంగా ఉండి, నిజమైన ఓటు పోకుండా ఉండాలి. ఆధార్ లింకింగ్, డేటాబేస్ పూర్తి చేయడం, ఇంటర్నెట్/మొబైల్ ద్వారా తనిఖీలు చేయడం వంటి మార్గాలు ఉండాలి. అయితే ఇది ప్రజల గోప్యత, డేటా భద్రత హక్కులకు హాని కలగకుండా ఉండాలి. ‘అధికారికంగా ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాద’ని ఈసీ తెలిపింది. సవరణ ఎన్నికల ముంగిట కాకుండా, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండాలి.
అయితే, బిహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ వివాదస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ సవరణలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈసీని నిందించింది. దొంగ ఓట్లను చేర్చారని అనుమానించింది. పెద్ద దుమారమే లేచింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఓటర్ల సవరింపులో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీయేతర పార్టీ ప్రభుత్వాలన్నీ సవరణను వ్యతిరేకిస్తున్నాయి. ‘స్థానిక సంస్థలకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎస్‌ఐఆర్ చేపట్టవద్దని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమిళ సీఎం అఖిలపక్షానికి పిలునిచ్చారు.
ఎన్నికల సంఘం విధుల్లో తలదూర్చడం తప్పే. అయితే, ఓటర్ల జాబితా ఆధునీకరణ పక్రియ ద్వారా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా, రాజకీయ పక్షపాత రహితంగా, అనుమానాలకు తావివ్వని విధంగా చేపట్టాల్సిందే. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికలు భారత రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు మూలస్తంభం. వాటిని నిర్వహించే ఎన్నికల కమిషన్‌ను బలోపేతం చేస్తూ పోవాల్సిందే. శేషన్ లాంటి వారు ఎన్నికల కమిషనర్‌గా ఉన్నత ప్రమాణాలను పాటించారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను చేపట్టే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేసింది. సీజేఐని తొలగించి, ఆ స్థానంలో సీనియర్ కేబినెట్ మంత్రిని సభ్యుడిగా చేర్చింది. దీన్ని వ్యతిరేకించిన సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెడుతూ పార్లమెంటులో చట్టం చేసింది. ఈ ప్రక్రియే అనేక అనుమానాలకు మూలంగా మారింది.
అయితే, బీహార్ ఎస్‌ఐఆర్ పక్రియపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనే లేదు. తాజాగా దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ చేపట్టడం వల్ల కొందరికి అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రం ఈ రకమైన అనుమానాలను నివృతి చేయాలి. ప్రతిపక్షాలు కూడా అనుమానాలుంటే వాటిని నిరూపించాలి. అంతేకానీ, వ్యవస్థనే తప్పుపడితే, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. పైగా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడ్డం కూడా మానుకోవాలి.

