ప్రకృతి మనకు అందించిన గొప్ప వరం. మన చుట్టూ ఉన్న సహజవనరులు. చెట్టూ, చేమా, అడవులు, సముద్రాలు, నదులు, సరస్సులు వంటి జలవనరులు, మంచినీరు, ఆహారం, జీవనాధారం మాత్రమే కాదు, అవన్నీ ఎన్నో జీవుల జీవాధారం కూడా. మనిషి నిర్లక్ష్యం వల్ల ఈ జీవ నవనరులు మరణశాసనం రాస్తున్నాయి. ప్రాణి జీవాధారమైన గాలి, నీరు, ఆహారం కాలుష్యాల వల్ల మనిషిదే కాదు మొత్తం ప్రాణుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. నీటి కాలుష్యం వల్ల అందులో ఉన్న చేపలు, ఇతర జలజీవులు అనేకమంది అజ్ఞానం, నిర్లక్ష్యం వల్ల మృత్యువాత పడుతున్నాయి.
ఇక పరిశ్రమల కాలుష్యం నదులను, చెరువులను, చివరకు సముద్రాన్ని కూడా కలుషితం చేస్తోంది. ఒకప్పుడు పటాన్ చెరువు, ఎల్‌బినగర్ సిరిస్ కంపెనీల కాలుష్యంపై ఏళ్లుగా పోరాటాలు జరిగాయి. హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారంగా మిగలిపోయింది. కొబ్బరి నీళ్లలా హుస్సేన్ సాగర్ నీళ్లను చేస్తానన్న కేసీఆర్ మాటలు నోరు దాటినా, సాగర్ ను తాకలేదు. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించినా అదంతా మనకు ఉట్టిగానే తోస్తోంది. ఇప్పుడు ఏపీలో ఉప్పాడ కాలుష్యంపై మత్స్యకారులు పోరాటం చేస్తున్నారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగానే స్పందించారు. అయితే ఆయన పట్టుదల ఎంతవరకు కార్యరూపం దాలుస్తందన్న తేలాల్సి ఉంది.
ఉప్పాడలో మాత్రమే కాదు, విశాఖలో సముద్రజలాల కాలుష్యం ఇంతకుమించి ఉంది. కాకినాడలో పారిశ్రామికంతోపాటు, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో ‘మాట-మంతి’లో మత్స్యకారులు సమస్యలపై పీసీబీ నుంచి వివరాలు తీసుకున్నారు. పొల్యూషన్ ఆడిట్‌కి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. కాకినాడ జిల్లాతోపాటు గోదావరి జిల్లాల్లో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై వివరాలు తెలుసుకున్నారు. ఇక ఎలాంటి అడుగులు వేస్తారన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచి ఉంది.
నిజానికి ఉప్పాడ తీరంలో ఉంటున్న జాలరులు సముద్రాన్నే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరి ఉపాధిని ఇబ్బడి ముబ్బడిగా వెలసిన ఫార్మా కంపెనీలు గండి కొడుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెడుతుండడంతో చేపలు, జాలరులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాకినాడ జిల్లా కెఎస్‌ఇజడ్ పరిధిలో లైఫిజ్, అరబిందో ఫార్మా లాంటి కంపెనీలు వ్యర్థాలను సముద్రంలోకి విడిచిపెట్టేందుకు యు.కొత్తపల్లి మండలంలో కోనపాపపేట, తొండంగి మండలం పెరుమల్లపురం మధ్యలో మూడు కిలోమీటర్ల పొడవునా భారీ పైపు లైన్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఫార్మా వ్యర్థాలు, విషపూరిత జలాలను శుద్ధి చేయకుండానే సముద్రంలోకి నేరుగా వదిలేస్తున్నారు. తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న హేచరీల ద్వారా రసాయనిక జలాలు, ఇతర వ్యర్థాలు సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీనివల్ల చేపలు దూరంగా వెళ్లిపోయాయి. కొన్ని చేపలు చనిపోతున్నాయి. గతంతో పోలిస్తే, ప్రస్తుతం చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. జాలర్లకు, చేపల పెంపకందారులకు నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.
ఈ కాలుష్యంపై పోరాటం గత ప్రభుత్వ హయాం నుంచీ జరుగుతోంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మారిన తర్వాతైనా న్యాయం జరుగుతుందని ఆశించారు. వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే సముద్రంలోకి వదలాలని కోరుతున్నారు. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ నుంచి తొండంగి మండలం అద్దారిపేట వరకు 32 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ రెండు మండలాల్లో 18 గ్రామాలకు చెందిన 50 వేల మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవిస్తున్నారు. పరిశ్రమల వ్యర్థాల వల్లే చేపలు చనిపోతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో చిన్నబోటుపై వేటకు వెళ్తే రోజుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల విలువైన చేపలు దొరికేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఒక్కసారి వేటకు వెళ్తే చిన్నబోటుకు రూ.2 వేలు, పెద్ద బోటుకు రూ.25 వేల నుంచి రూ.30వేల వరకూ ఆయిల్‌కు ఖర్చవుతుందని తెలిపారు. పెద్ద బోట్లలో 12 మంది వరకూ వేటకు వెళ్తారని, 15 రోజుల వరకూ సముద్రం లోనే ఉండాల్సి ఉంటుందన్నారు. ఆయిల్, ఐస్, ఇతర నిర్వహణకు మొత్తంగా రూ.1.50 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. ఖర్చులుపోనూ గతంలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ఆదాయం సమకూరేదని, ప్రస్తుతం చేపలు దొరక్కపోవడంతో ఖర్చులు కూడా రావట్లేదని ఉప్పాడ మత్స్యకారులు లబోదిబోమంటున్నారు.
మత్స్యకారులు గతేడాది ఏప్రిల్‌లో బీచ్ రోడ్డుని పూర్తిగా నిర్బంధించి పది రోజులపాటు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడారు. కాలుష్యాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఆయన డిప్యూటీ సిఎం అయినప్పటికీ ఆ హామీ అమలు కాలేదు. దీంతో, మత్స్యకారులు మళ్లీ ఆందోళనబాట పట్టారు. వేల సంఖ్యలో ఉప్పాడ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించి సమస్య పరిష్కారానికి వంద రోజుల సమయం కావాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం కార్యాచరణకు దిగారు. మరి పవన్ కళ్యాణ్ హామీ ఎంతవరకు అమలవుతుందో, మత్స్యకారులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో చూడాలి.

