మన దేశం వ్యవసాయక దేశం. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. జనాభాలో అరవై శాతానికి మించిన ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, ఏనాడూ వ్యవసాయం అంత లాభసాటిగా లేదు. పాతకాలపు పద్ధతులు, నీటి కొరత, మార్కెటింగ్ లోపాలు, దళారుల హస్తలాఘవం, పెట్టుబడుల కొరత, మద్దతు ధర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం, విధానాలే లేకపోవడం వంటి అనేక సమస్యలు వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్నాయి.
స్వాతంత్ర్యం వచ్చి 80 కావస్తునా, వ్యవసాయ రంగం వికాసానికి స్వల్ప, దీర్ఘ కాలిక పరిష్కారాలను ఇంకా వెతకాల్సి రావడం సిగ్గుచేటు. వ్యవసాయ రంగంలో తాత్కాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవి రైతులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడతాయి. వర్షాభావం, వడగళ్ల వాన, తుపానుల కారణంగా పంట నష్టపోతే రైతులకు తక్షణంగా పరిహారం అందించాలి. పంటల బీమా పథకాలను వర్తింప చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు లేదా కరువు, ధరలు పడిపోవడం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుండి రైతులను విముక్తి చేయడానికి రుణభారంలో నుంచి సబ్సిడీని అందించాలి. రైతులకు కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. అవసరమైతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి. విత్తనాలు, ఎరువులు, మందులకు సబ్సిడీలను పెంచాలి. పంట కోత సమయంలో ధరలు పడిపోకుండా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయగల సామర్థ్యం కలిగిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్ లు ఉండాలి. రైతు బజార్లు, డైరెక్ట్ మార్కెటింగ్ యూనిట్లు పెంచాలి.
అలాగే, వ్యవసాయం రంగాన్ని అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక దృక్కోణం కూడా అవసరం. వ్యవసాయంలో నీటి వాడకం అత్యధికంగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులపై దృష్టి పెట్టాలి. సాగునీటి ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించాలి. భూముల రికార్డుల ఆధునీకరణ, భూముల డిజిటలైజేషన్ ద్వారా రైతుల భూములకు భద్రతను పెంచాలి. చిన్న రైతులు భూమి హక్కులను పొందడానికి సులువువైన పద్ధతులు ఉండేలా చూడాలి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. అగ్రి-యూనివర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా తాజా పరిశోధనల్ని రైతులకు చేరవేయాలి. రోడ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగులు వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడం వల్ల రైతులకు నిల్వ, రవాణా సౌలభ్యం కలుగుతుంది. దీని ద్వారా ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. చిన్న రైతులు కలిసి ఎఫ్ పీఓలను స్థాపించి తమ ఉత్పత్తిని కూడగట్టగలగాలి. దీనివల్ల వారికే ఎక్కువ లాభాలు లభిస్తాయి, మధ్యవర్తుల, దళారుల దోపిడీ తగ్గుతుంది. అధిక దిగుబడులు ఉన్న పంటల కోసం విదేశీ మార్కెట్లను సిద్ధం చేయాలి. ప్రభుత్వం సరైన విధానాలతో ఎగుమతులకు మద్దతివ్వాలి. ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఆధారంగా వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, సలహాలు రైతులకు చేరేలా చేయాలి. కృత్రిమ మేధ వంటి పరిజ్ఞానం వ్యవసాయంలో ప్రవేశించాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ విధానాలు రూపొందించాలి. వ్యవసాయ మార్కెట్ చట్టాల సరళీకరణ చేయాలి. ‘ఈ-నామ్’ వంటి డిజిటల్ మార్కెట్ ప్లాట్‌ఫాంను విస్తరించాలి. రైతులకు క్రెడిట్ రేటింగ్ సిస్టం రూపొందించి, మంచి రైతులకు తక్కువ వడ్డీకి రుణాలుపడాలి.
అయితే, వీటన్నింటినీ అమలు చేయడంలో కొన్ని సవాళ్ళు, ప్రతి బంధకాలు కూడా ఎదురవుతున్నాయి. రాజకీయాలకు లోనైన రుణ మాఫీలు, సబ్సిడీలు వ్యవస్థను కల్లోలపరుస్తున్నాయి. వ్యవసాయంలో లాభాలు లేకుండా పోవడంతో యువత వ్యవసాయరంగం వైపు రావడం లేదు. వాతావరణ మార్పులు, కలుషిత భూగర్భ జలాలు వంటి సమస్యలు విపరీత ప్రభావం చూపుతున్నాయి.
వ్యవసాయం రంగం అభివృద్ధి చెందాలంటే తక్షణ చర్యలు మాత్రమే సరిపోవు. ముందు చూపుతో దీర్ఘకాలిక సంస్కరణలు, శాశ్వత పరిష్కారాలు వెతకాలి. రైతులను ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలంటే విధానాలు సమర్థవంతంగా అమలవ్వాలి. స్వాతంత్ర్యం పొందిన నాటి నుండి ఇప్పటి వరకు వ్యవసాయ రంగం ఎన్నో విప్లవాత్మక మార్పులకు లోనైంది. ఇకపై సాంకేతికత, మౌలిక వసతులు, మార్కెట్ లింకేజ్ వంటి సంస్కరణలు అనే నాలుగు స్తంభాలపై అభివృద్ధి నిర్మించాల్సిన అవసరం ఉంది. ‘అభివృద్ధి చెందే దేశానికి శక్తివంతమైన వ్యవసాయ రంగం అవసరం’ అనే నినాదం నిజం కావాలంటే తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక దృక్కోణంతో వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నది.

