ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారత ఆలయ యాత్రలో భాగంగా బుధవారం కేరళలోని చొట్టనిక్కర శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. కొచ్చి విమానాశ్రయం నుంచి ఆలయానికి చేరుకున్న ఆయనకు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం అందించారు. తనయుడు అకిరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయితో కలిసి పవన్ కళ్యాణ్ ఆలయ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యం, మూలికల ప్రాముఖ్యత గురించి వైద్యులను ప్రశ్నించారు. ప్రత్యేకంగా నడుము నొప్పి, స్పాండిలైటిస్‌కు ఆయుర్వేద చికిత్స గురించి వివరాలు తెలుసుకున్నారు. మర్మ చికిత్స, గోశాల విశేషాలను పరిశీలించి, అఖండ జ్యోతికి నమస్కరించారు. సుదీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం ప్రభావశీలమని వైద్యులు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఆలయ నిర్మాణ శైలిని, పురాణ ప్రాముఖ్యతను గమనించారు.

