వందే భారత్ ట్రైన్‌లో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది, దీని వల్ల ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20707/20708) రైళ్లకు ఎలూరు రైల్వే స్టేషన్‌లో స్టాప్ సౌకర్యాన్ని కొనసాగించనుంది. ఈ ప్రత్యేక ఏర్పాటు మొత్తం ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది.
ఇక నుంచి మరో ఆరు నెలల పాటు సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ట్రైన్ ఎలూరులో ఆగనుంది. అదనపు నిలుపుదల అమలు తేదీలను పరిశీలిస్తే, ఫిబ్రవరి 25 నుంచి 20707 సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎలూరులో ఆగుతుంది. ఫిబ్రవరి 26 నుంచి 20708 విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా అదే స్టేషన్‌లో నిలుస్తుంది.
రైల్వేస్ ఇటీవలే ఈ రైలు కోచ్‌ల సంఖ్యను 20కి పెంచింది. ఇందులో 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లు, 18 చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ రైలు వారంలో ఆరు రోజులు మాత్రమే నడుస్తుంది, మంగళవారం మాత్రం సేవలు అందుబాటులో ఉండవు.
విశాఖపట్నం మరియు సికింద్రాబాద్ మధ్యలో ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ మార్పులతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

