ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన తాజాగా ప్రారంభమైన పనులను పరిశీలించడమే కాక, యంత్రాల పనితీరు గురించి వివరాలు తెలుసుకున్నారు.
మంత్రిగారు ప్రాజెక్టు పక్కన ఉన్న ప్రయోగశాలను సందర్శించి, ప్యానల్ తవ్వకాల్లో వచ్చే మెటీరియల్స్‌ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో ఇటీవల వెయ్యి కోట్లు జమ చేశామని వెల్లడించారు.
మూడు కట్టర్ల ద్వారా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఫిబ్రవరి 1న రెండో కట్టరు, ఏప్రిల్ నాటికి మూడో కట్టరు పని చేయడం ప్రారంభిస్తాయని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని మంత్రి అన్నారు.

