మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. విశాఖపట్నంలో రూ. 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి రాష్ట్ర అభివృద్ధికి తన కృషిని ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ వెల్లడించిన ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు కొత్త శక్తిని అందించనున్నాయి. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో వ్యాపార, వ్యవసాయ రంగాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే లక్ష్యమని, ఈ హైడ్రోజన్ హబ్ ఏపీకి కీలక అభివృద్ధి కేంద్రంగా మారుతుందని వివరించారు.
ఇక నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేయడంతో రాష్ట్రానికి ఫార్మా రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో శ్రీసిటీ భాగం కావడం ద్వారా తయారీ రంగానికి ఊతం లభిస్తుందని ప్రధాని తెలిపారు.
ప్రధానమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పనిచేస్తుందని, విశాఖలో ప్రారంభించిన ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ప్రజల చిరకాల వాంఛల్ని నెరవేరుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం దిశగా రాష్ట్ర ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించే లక్ష్యాన్ని వెల్లడించారు.

