విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఎంపీ డీకే అరుణ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాన్ని స్వీకరించి, లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రావాలని అనుకున్నప్పటికీ వరదల కారణంగా ఆలస్యం అయిందని ఆమె తెలిపారు. విజయానికి ప్రతీక అయిన కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో మంచి విజయం లభించిందని, అమ్మవారి ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.
ఆలయం గతంలో కంటే చాలా అభివృద్ధి చెందిందని, దర్శనం ఎంతో చక్కగా సాగిందని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల ప్రజలందరికీ మంచి జరగాలని ప్రార్థించిన ఎంపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏలో ఉండే సీఎం, ఎమ్మెల్యే సుజన చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

