ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్య మంత్రివర్గం సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ముఖ్యంగా, ఎస్‌ఐపిబి (SIIB) ఆధ్వర్యంలో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.
నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఏల్ భారీ రిఫైనరీ స్థాపనకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు ఉంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 20 ఏళ్ల కాలంలో రూ. 88,747 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే, శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రారంభించనుంది, దీని ద్వారా 2,381 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ సంస్థ రూ. 1,174 కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనుంది. అలాగే, రాష్ట్రంలో పర్యావరణం అనుకూలంగా పనిచేసే ఐదు క్లీన్ ఎనర్జీ సంస్థలకు రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గోదావరి నుంచి బనకచర్ల వరకు నదుల అనుసంధాన ప్రాజెక్టుపై కూడా చర్చ చేయనున్నారు.

