రాజకీయ రంగు పులుముకున్న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, పోలీసులను అవమానించడం తో బెయిల్ రద్దయ్యే అవకాశం
ఇటీవల పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేయగా, తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై ఉన్నారు. ఈ విషయంపై ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రశ్నించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తూ… పోలీసుల నిబంధనల ప్రకారం, అల్లు అర్జున్ చాలా నిర్లక్ష్యంగా వున్నారు అన్నారు. ఒక మహిళ చనిపోయింది. అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ, మొదట ఆయన వెళ్లిపోవడానికి నిరాకరించారని చెప్పారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ మాట్లాడుతూ…. మహిళ చనిపోయిన విషయం తనకు తెలియకపోవడం వల్లనే నేను తిరస్కరించానని, తరువాతే ఈ విషయం తనకు తెలిసింది అని చెప్పారు. అదే సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మరోవైపు, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న విషయం కావడంతో ముఖ్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించడం, మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడం వంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.
ఈ పరిణామాల మధ్య, తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు, “అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు” అంటూ కోర్టులో వాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా, జ్యూడీషియల్ కోర్టు కఠిన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో, కేసు విచారణ ముగిసే వరకు అల్లు అర్జున్ పై ఉన్న బెయిల్ రద్దు చేయాలని ప్రజలు చర్చ చేస్తున్నారు.
కాగా, ఈ సంఘటన రాజకీయ రంగు కూడా పులుముకుంది. కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపడుతూ, అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే, బీఆర్‌ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, బీఆర్‌ఎస్ అల్లు అర్జున్‌ను ఎందుకు మద్దతు ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు, ఈ వివాదం మధ్యలో, తెలంగాణ పోలీసుల ఆలోచన ప్రకారం అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ప్రముఖ నటుడు కావడంతో, కేసు విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వొద్దు” అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో, అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ రద్దవుతుందా… లేదా కోర్టు బెయిల్‌ను కొనసాగిస్తుందా… అన్నది ఈ రెండు రోజుల్లో తేలనుంది.

