భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయి వివాహం ఆదివారం ఉదయ్‌పూర్‌లోని ఓ దీవిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా శాస్త్రబద్ధంగా నిర్వహించారు. పండితుల వేదమంత్రాల నడుమ, రాత్రి 11.20 గంటలకు సింధు మెడలో దత్త మూడు ముళ్లు వేసాడు.

సినిమా స్టైల్ పెళ్లికి, ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులోని 21 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న దీవి వేదికగా మారింది. ఆరావళి పర్వతాల మధ్య సుప్రసిద్ధ రఫల్స్ సంస్థ నిర్మించిన రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ రిసార్ట్ మూడు ప్రధాన భవనం 100 గదులతో వుంది, వీటిలో వివాహం కోసం ప్రత్యేకంగా గదులను బుక్ చేశారు. ఈ రిసార్ట్‌లో ఒక గదికి ఒక్క రోజు అద్దె సుమారు రూ. లక్ష ఉండగా, సింధు పెళ్లి కోసం వంద గదులు బుక్ చేశారు.
ఈ వేడుకలో, పీవీ సింధు కుటుంబం అతిథుల కోసం ప్రత్యేకంగా విమాన టిక్కెట్లు బుక్ చేసి, అతిథులను ప్రత్యేక పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వేడుకను శోభాయమానంగా నిర్వహించేందుకు తెలుగుదనంతో పాటు రాజస్థాన్ రాచరిక సంస్కృతి కూడా చక్కగా ప్రతిబింబించింది. ప్రముఖులు వీరి వేడుకకు హాజరయ్యారు. వీరిలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వివాహ వేడుక తర్వాత, మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో సింధు-దత్తసాయి వివాహ రిసెప్షన్ జరగనుంది.

