తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సుస్థిర పాలన ద్వారానే దేశం ముందుకు సాగుతుందని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి, ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని గెలిపించడం దేశ ప్రజల ఆత్మగౌరవానికి సంకేతమన్నారు. దేశ, రాష్ట్ర రాజధానులు ప్రజల ఆకాంక్షలు తీర్చేవి కావాలని, కానీ ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు రాజకీయ కాలుష్యమూ పెరిగిపోయిందన్నారు.
మోదీ అమలు చేస్తున్న సుస్థిర అభివృద్ధి విధానాల వల్లే బీజేపీకి ప్రజలు మద్దతు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. అభివృద్ధి లేకపోతే సంపద సృష్టి అసాధ్యమని, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ అవసరమని తెలిపారు. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల వల్లనే దేశంలో మార్పు వచ్చిందని, అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు లభించాయని అన్నారు. గుజరాత్‌లో తలసరి ఆదాయం 15 రెట్లు పెరిగితే, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం 4 రెట్లు మాత్రమే పెరిగిందని ఉదాహరణ ఇచ్చారు. ఏపీలో కూడా తలసరి ఆదాయం పెరిగిందని, పాలనా మార్పుల వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు.
ఢిల్లీలో రాజకీయ అవినీతి పెరిగిపోయిందని, మద్యం వ్యాపారం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. పంజాబ్ వ్యవసాయం నుంచి డ్రగ్స్ కేంద్రంగా మారిందని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ఏపీలోనూ వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, ప్రజల డబ్బుతో పాలన సాగించారని విమర్శించారు. అభివృద్ధిని నిర్వీర్యం చేయడం సులభమే కానీ, నిర్మాణాత్మక అభివృద్ధి కోసం సరైన నాయకత్వం అవసరమన్నారు. తాను వికసిత ఏపీ 2047 డాక్యుమెంట్ రూపొందించానని, దీని ద్వారా ఏటా 15% వృద్ధిరేటు సాధిస్తే రాష్ట్ర జీడీపీ 4.5 రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. ప్రజలు దీని ప్రాముఖ్యత త్వరలోనే అర్థం చేసుకుంటారని చంద్రబాబు నాయుడు అన్నారు.

