నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు
విద్యార్థులకు సరైన పోషకాహారం ఇవ్వాల్సిన బాధ్యత మనదే
పాలకుర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి
నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. అడుగు డిజిటల్ మీడియా వరుస కథనాలతో మంజూరైన సుమారు 30 లక్షల ప్రభుత్వ నిధులతో పాలకుర్తి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం తదితర పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే స్కూల్లో వంట గదిని పరిశీలించి భోజన నాణ్యతను తనిఖీ చేశారు. పాఠశాల సదుపాయాల గురించి అక్కడి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరైన విద్యతో పాటు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడం మన బాధ్యత అని చెప్పారు. విద్యార్థులకు పోషకాలు అందించడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మెనూ చార్జీలు పెంచిందని గుర్తు చేశారు. పాలకుర్తి జెడ్పీహెచ్ఎస్ లో చదివిన వాళ్ళు అందరూ కూడా మంచి స్థానాల్లో ఉన్నారని, వారి సహకారం తీసుకొని మరింత అభివృద్ధి చేసుకుందాం అన్నారు. పాలకుర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన డిగ్రీ కళాశాలను మంజూరు చేయమని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగామని, వారు మంజూరు చేయడానికి సుముఖంగా ఉన్నారని తెలియచేశారు.

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రతి పేద వాడికి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ స్కూల్స్ పనిచేస్తున్నాయి అన్నారు. మా కుటుంబం కూడా మా స్వగ్రామం చర్ల పాలెంలో ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేశామని గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఏ సమస్యలున్నా… తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్, మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు, అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

