మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం, నాగారం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున కూలీ పనులకై వెళ్తున్న మిర్చి కూలీల వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొర్రూర్ మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన గూడెల్లి అరుణ (భర్త సాయిలు) అనే మహిళ దుర్మరణం చెందగా, మరో 17 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలంతా చర్లపాలెం మరియు ఫతేపురం గ్రామాలకు చెందినవారు. వారిని హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు


ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి ఝాన్సీ రెడ్డి హుటాహుటిన దవాఖానకు చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఘటనలో చనిపోయిన మహిళ కు నివాళులు అర్పించారు. ఆ తరువాత బాధితుల పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించిన ఎమ్మెల్యే

అసెంబ్లీలో సమావేశాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రమాద విషయం తెలిసిన వెంటనే వారు కూడా జిల్లా వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించమని, అవసరమైతే హైదరాబాద్ కి తరలించాలని ఆదేశించారు.

