మెక్సికోలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది, దీంతో బస్సులో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ విషాద ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. బస్సులో మొత్తం 48 మంది ప్రయాణిస్తుండగా, ప్రమాదం అనంతరం మంటలు విస్తరించడంతో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు వెల్లడించారు.
సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు 18 మందికి సంబంధించిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.

