అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగాల కోతపై ట్రంప్ సర్కారు తీసుకున్న వ్యూహం మెల్లగా ఫలితాలిస్తోంది. గురువారంతో (అమెరికా కాలమానం ప్రకారం) ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపీఎం) అందించిన బైఅవుట్ ఆఫర్ గడువు ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఓపీఎం కూడా ధ్రువీకరించింది. అయితే, ట్రంప్ అధికార వర్గం ఊహించిన దానికంటే ఈ సంఖ్య తక్కువగానే ఉందని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తోంది.
ఈ బైఅవుట్ స్కీమ్‌పై ఓపీఎం ఒక మెమో విడుదల చేసింది. ఈ మేరకు 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈమెయిల్ పంపింది. స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వీడిన వారికి ఎనిమిది నెలల జీతం అందిస్తామని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 6 లోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. బై అవుట్ ఆఫర్ పొందిన వారు సెప్టెంబర్ వరకు పని చేయకుండానే జీతం పొందొచ్చని చెబుతున్నా, దానికి ఎటువంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తే, ఫెడరల్ ఖర్చులను ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చని అంచనా వేస్తోంది. ఫెడరల్ నిధులు, రుణాలను నిలిపివేసిన సమయంలో ఈ వార్త బయటకు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం స్థానిక ప్రభుత్వాలు, నాన్ ప్రాఫిట్ సంస్థల పనితీరుపైనా ప్రభావం చూపనుంది.

