అమెరికా, భారత్‌కు చెందిన అక్రమ వలసదారులను తిరిగి పంపించేందుకు ఓ సైనిక విమానం వినియోగించింది. సి-17 గ్లోబ్మాస్టర్ సైనిక రవాణా విమానం 104 మంది భారతీయులను తీసుకొని అమృత్సర్‌లో ల్యాండ్ అయింది. సాధారణ వాణిజ్య విమానాలతో పోలిస్తే, సైనిక విమానాల ఖర్చు భారీగా ఉంటుంది. గ్వాటెమాలకు ఒక వలసదారుడిని పంపేందుకు సుమారు 4,675 డాలర్లు ఖర్చవుతుండగా, అదే ఫస్ట్-క్లాస్ టికెట్ ద్వారా పంపితే కేవలం 853 డాలర్ల వ్యయం అవుతుంది. ట్రంప్ తిరిగి అధికారంలోకి రాగానే, అక్రమ వలసదారుల తొలగింపును కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. దీంతో అమెరికా సైన్యం హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖకు మద్దతు ఇస్తూ, అక్రమ వలసదారుల తరలింపునకు సాయంగా వ్యవహరించింది. ఇప్పటి వరకు అక్రమ వలసదారుల తరలింపులో కేవలం ఆరు సైనిక రవాణా విమానాలను మాత్రమే ఉపయోగించారు. అయితే, వాణిజ్య విమానాల కంటే సైనిక విమానాల వినియోగం మరింత ఖరీదైనదిగా ఉంది. అమెరికా వద్ద 223 సీ-17 విమానాలు ఉండగా, వాటి మొత్తం విలువ 75.8 బిలియన్ డాలర్లు.
భారత్ తమ దేశ పౌరులను స్వీకరించేందుకు సన్నద్ధమని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన భారతీయుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. పంజాబ్ ఎన్నారై మంత్రి కుల్దీప్ సింగ్ ధాలీవాల్ మాట్లాడుతూ, ఈ వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు సహాయపడినవారే కాబట్టి, వారిని పంపించేయడం కంటే పర్మినెంట్ రెసిడెన్సీ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లడం ప్రమాదకరమని ప్రజలకు సూచించారు.

