టెస్ట్ క్రికెట్ ఎందుకు అత్యంత కఠినమైన ఫార్మాట్‌గా పిలుస్తారో మరోసారి రిషబ్ పంత్ తన ఫైటింగ్ ఇన్నింగ్స్‌తో చూపించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో పంత్ చూపిన ధైర్యం, పట్టుదల క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంది. 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్, కంగారూ పేసర్ల బౌన్సర్లు, స్వింగ్ బంతులను ఎదుర్కొంటూ తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించాడు.
మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, బోలాండ్‌లు అద్భుత పేస్‌తో దాడి చేయగా, పంత్ ఒంటినిండా గాయాలు పాలవడాన్ని సహించుకుంటూ క్రీజులో నిలబడ్డాడు. బౌండరీలు కొట్టడం కంటే, డిఫెన్సివ్‌గా ఆడుతూ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించాడు. 98 బంతుల్లో 40 పరుగులు చేసిన పంత్, భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తన సహజ ఆటకు భిన్నంగా ఆడిన ఈ ఇన్నింగ్స్ పంత్ ప్రతిభకు నిదర్శనం. గాయాలను ఓర్చుకొని, అత్యంత క్లిష్ట పిచ్‌పై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న అతడి ప్రయత్నం జట్టుకు విలువైన పరుగులు అందించింది. అతడి డిఫెన్స్‌తో భారత జట్టు కనీస పరుగు స్కోరైనా సాధించగలిగింది. క్రికెట్ విశ్లేషకులు పంత్ ఆటతీరును ప్రశంసిస్తూ, ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని చెబుతున్నారు. “ఏం గుండె సామి ఇది!” అంటూ అభిమానులు అభినందిస్తున్నారు.

