అమెరికా హెచ్1బీ వీసాల విస్తరణపై రిపబ్లికన్ పార్టీలో తీవ్ర విభేదాలు చెలరేగాయి. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అమెరికా ఉద్యోగాలకు స్థానికులను ప్రోత్సహించాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తున్నారు. మస్క్ తాజాగా చేసిన ట్వీట్ రిపబ్లికన్ పార్టీలో చర్చకు దారితీసింది. పార్టీలోని “మూర్ఖులను తొలగించాల్సి ఉంది” అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
ట్రంప్ అధ్యక్ష పదవీ కాలంలో పలు కీలక పదవులకు భారతీయ అమెరికన్లు నియమితులవడంతో పాటు, వలసదారుల పాత్రపై చర్చలు ముదురుతున్నాయి. శ్రీరామ్ కృష్ణన్ వంటి వ్యక్తులను నామినేట్ చేయడంపై కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నైపుణ్యవంతులైన వలసదారుల ఆవశ్యకతపై మస్క్ తరచుగా తన మద్దతు ప్రకటిస్తుంటారు. మరోవైపు, రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ అమెరికన్ ఉద్యోగుల శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వివేక్ రామస్వామి వంటి నేతలు అమెరికా సంస్కృతిలో లోటుపాట్లను ఎత్తిచూపుతున్నారు.

