Nalgonda|నల్గొండ జిల్లా పరిధిలో ప్రధాన జలవనరుల కేంద్రంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో జలాశయం నిండు కుండలా మారింది. అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లోగా 2,01,743 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ఔట్‌ఫ్లో 41,497 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం అది 586.80 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 304.4680 టీఎంసీలకు చేరినట్లు సమాచారం. ప్రస్తుత వరద పరిస్థితుల్లో జలాశయం త్వరలోనే పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితోపాటు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరవధికంగా కొనసాగుతోంది. గేట్లు నియంత్రించి, ఎత్తి నీటిని విడుదల చేయడంతోపాటు ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచనలు చేసింది. వరద ఉధృతి క్రమంగా పెరగొచ్చని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, జలాశయ లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

