-పట్నాలు తొక్కిప పాపగుణమా!?
-ఎప్పటికైనా శాంతి పూజ తప్పదా?
-అప్పటి వరకు ఈ అశాంతి వీడదా?
-సెంటి ‘మెంటలై’పోతున్న అనుచరులు!
-మంత్రి కొండా సురేఖకు వరుస వివాదాలు అందుకేనా!
కొమురెల్లి మల్లన్న కొంటెతనమో!? ‘పట్నాలు’ తొక్కిన పాపగుణమో!? కానీ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ వివాదం మీద వివాదంగా తీవ్ర వివాదాల్లో కూరుకుపోతున్నారు. గత ఏడాదిగా ఆమె మాటలు మంటలు రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు ఆమెపైనే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎప్పటికైనా శాంతి పూజ తప్పదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఈ అశాంతి వీడే అవకాశమే లేదని, భక్తి సెంటిమెంటుతో రగిలిపోతున్న ఆమె అనుచరులు సెంటి ‘మెంటలై’ పోతున్నారట! మంత్రి కొండా సురేఖకు వరుస వివాదాలు అందుకేనంటూ చెయ్యెత్తి జై కొడుతున్నారట! మరి ఈ వివాదాల నుంచి బయటపడటానికి కొండా దంపతులు ఏం చేస్తారన్నది ఆసక్తిగానే కాదు ఉత్కంఠగా మారింది.!
Konda Surekha| కొండా సురేఖ మంత్రి హోదాలో గత ఏడాది జనవరిలో చేర్యాల సమీపంలోని కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. ఆ సందర్భంగా కొమురెల్లిలో ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్టతో వేసే పట్నాలను అనుకోకుండా పొరపాటుగా తన మనవడిని ఎత్తుకుని మంత్రి తొక్కారట. ఆ తర్వాత ఆ చర్యను సరిదిద్దుకున్నారు. అయితే, కొమురెల్లిలో పట్నాలను పిల్లలు, శివసత్తులు, ఒగ్గుపూజారులు మాత్రమే వాటిని తొక్కువచ్చని భక్తుల నమ్మిక. పట్నాలు కొమురెల్లి పట్నాలు మల్లన్న ఆలయంలో నిర్వహించే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. మల్లన్న ని ఆరాధించే ఒక భాగం. భక్తులు తమ కోరికలు, నమ్మకాలను స్వామికి తెలియజేసే ఒక మార్గం. భక్తులు పసుపు, కుంకుమ, ఇతర రంగుల పొడితో రంగోలి గీస్తారు. ఆలయం లోపల, వెలుపల వరండాలో మల్లన్న స్వామికి ముందు పట్నాలు వేస్తారు.
అయితే, ఆనాటి నుండి వరసగా ఏదో ఒక వివాదంలో మంత్రి సురేఖ ఉంటున్నారట. ఆమె ఏం మాట్లాడినా అదొక వివాదాస్పదం అవుతోందట. సాటి మహిళ, హీరోయిన్ సమంత విషయంలో నోరు జారి అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి స్థాయిలో కోర్టు మెట్లు ఎక్కారు.
ఆ మధ్య ఓ ఫోన్ ఆడియోలో ఆమె సంబాషణలు అన్ పార్లమెంటరీ భాషతో వివాదాస్పదమయ్యాయి. మొన్న ఒక ప్రెస్ మీట్ తర్వాత, అక్కడ మైకులు ఆన్ లో ఉన్నాయని కూడా చూసుకోకుండా, ‘మా అన్నయ్య వాళ్ళ మనుమడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు, ఉద్యోగం ఇప్పంచండి’ అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును అడిగి వైరల్ అయ్యారు. నిన్న వరంగల్ లో ప్రపంచ సుందరీమణుల ముందు వచ్చీ రాని ఇంగ్లీష్ లో మాట్లాడి నవ్వుల పాలయ్యారు.
పిల్లలతో ఓ స్కూల్ మీటింగులో ‘అటవీశాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్ళ క్లియరెన్స్ కోసం వస్తాయి. మమూలుగా అలాంటి ఫైళ్ళు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో నేను అన్నా… మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు. పై వాళ్ళతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకుచెందిన సదానందరెడ్డి చెప్పారు. చివరకు సిఎస్ఆర్ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది.’ అన్నారు.
ఆ వివాదాన్నుంచి తప్పించుకోవడానికి నోరు విప్పి మరో వివాదంలోకి కూరుకుపోయారు. ‘నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను.’ అన్నారు.
మొత్తంగా మంత్రి సురేఖ, రాష్ట్ర కేబినెట్ లోనే కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా మారారు. సురేఖ వ్యవహారంపై గతంలోనే ఎఐసీసీ అసహనం వ్యక్తం చేసింది. తాజా ఇష్యూతో తోటి మంత్రులు తల పట్టుకుంటున్నారట. మరోవైపు ఆమె మాటలు CM|సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారుతున్నాయట.
అయితే, మల్లన్న పట్నం తొక్కినప్పటి నుండే ఇలా జరుగుతోందని ఆమె అనుచరులు తెగబాధ పడుతున్నారట. శివ సత్తులు, చిన్న పిల్లలు , ఒగ్గుపూజారులు మాత్రమే పట్నం తొక్కాలి కానీ తన మనువడితో పట్నం తొక్కిన మంత్రి సురేఖ పరేషాన్ అవుతోందని అమె అనుచరులు లోలోన కుమిలిపోతున్నారట. శాంతిపూజ చేస్తే తప్ప దోషం పోదని ఒగ్గుపూజారులు అంటున్నారట. మంత్రి కొండా సురేఖ అనుచరులు ఈ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలో తెలియక లోలోన మథనపడుతున్నారట. పోనీ కొండా మురళీకి చెబుతామన్నప్పటికీ ఆయన వినిపించుకుంటారో లేదోనని ఆవేదన పడుతున్నారట. అందుకే ఒగ్గు పూజారుల ద్వారా Minister|మంత్రి కొండా సురేఖ దంపతులకైతే చేరవేయగలిగారట. ఇప్పటికే ఈ విషయాన్ని కొండా దంపతులకు ఒగ్గుపూజారులు చెప్పి చూశారట. ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్న కొండా దంపతులు మాత్రం దీర్ఘాలోచనలో పడ్డారట!? మరి వివాదాల నుంచి బయటపడటానికి కొండా దంపతులు ఏం చేస్తారన్నది ఆసక్తిగానే కాదు ఉత్కంఠగా మారింది!

