పరిపాలన, రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజా చిట్ చాట్‌లో తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఇంకా ఇరవై ఏళ్లు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. చట్టపరంగా వ్యవహరించడమే తన ధ్యేయమని, ఏకంగా అరెస్టులు చేయమని డిమాండ్ వచ్చినా, చట్టానికి విరుద్ధంగా పనిచేయబోనని చెప్పారు. “నేను కమిట్మెంట్ ఇస్తే తప్పక చేసి తీరుతా” అని ఆయన చెప్పారు. దీనికి ఉదాహరణగా, అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించాను అని గుర్తు చేశారు. గతంలో చేసిన పనులను ప్రజలకు వివరించడంలో కొద్దిగా వెనకబడినట్లు చెప్పారు. పరిపాలనను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సరిగ్గా స్ట్రీమ్‌లైన్ చేశామని వివరించారు. కొన్ని విభాగాల్లో ఆప్షన్ లేకపోవడం వల్లే కొందరు అధికారులను కొనసాగించాల్సి వచ్చిందన్నారు.
అంతర్జాతీయ రాజకీయ నాయకులపై స్పందిస్తూ, ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఒక దేశాన్ని ఓడించిన గొప్ప చరిత్ర ఇందిరా గాంధీదేనని అన్నారు. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్ తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే మాట్లాడతారంటూ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తన పనితీరు గురించి ఎవరిని నమ్మించాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలులో లేవని పేర్కొన్నారు.
తాను చేపట్టిన పాలనపై ప్రజలు చివరి ఆరు నెలల్లో ఓ నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. కగార్ (KAGAR) అంశంపై జాతీయ స్థాయిలో చర్చ అవసరమని, తమ పార్టీ నిర్ణయం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ తన ప్రసంగాల్లో అసంతృప్తిని చూపిస్తున్నారని విమర్శించారు. “పిల్లగాళ్లంటూ అసెంబ్లీలోకి వారిని పంపుతున్నాడంటే అదే అతని రాజకీయ పతనానికి సంకేతం” అన్నారు. కేసీఆర్ ప్రసంగాలకు పరిపక్వత లేదని స్పష్టం చేశారు. గత సంవత్సరం నరo నుంచి తీసుకొచ్చిన పథకాలను ఇప్పుడు సమర్థంగా అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.

