తెలంగాణ రాష్ట్రంలో గిగ్ మరియు ప్లాట్‌ఫాం వర్కర్లకు భద్రత కల్పించే చట్టం ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ బిల్లును ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కార్మిక శాఖ రూపొందించిన బిల్లులో గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఇతర హక్కులు కల్పించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం డిసెంబర్ 30, 2023న గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేసిన సంగతి గుర్తు చేశారు. బిల్లు దేశానికి మార్గదర్శకంగా ఉండేలా రూపొందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల సలహాలు, సూచనలు బిల్లుకు కీలకమని సీఎం తెలిపారు. ఫుడ్ డెలివరీ, క్యాబ్ డ్రైవర్లు, ప్యాకేజింగ్ డెలివరీ వర్కర్లతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు తుది ముసాయిదాను సిద్ధం చేసి, మే 1 (మేజీ) నాటికి కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

