: మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ వర్గీకరణ అమలు జీవో తొలి కాపీని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో మంత్రి దామోదర మాట్లాడారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా దళితులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాకుండా, దళితుల్లోని అంతర్గత అసమానతలను తొలగించేందుకు చేపట్టిన చట్టబద్ధ ప్రక్రియగా అభివర్ణించారు.
డా. బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు ఈ నిర్ణయం తీసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, కమిట్‌మెంట్ వల్లే తక్కువ సమయంలో వర్గీకరణ అమలయ్యిందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి ఎనిమిదన్నర నెలల్లో వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా 59 షెడ్యూల్డ్ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కేటాయించిన విషయాన్ని వివరించారు.
గ్రూప్-1లో అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్, గ్రూప్-2లో మధ్యస్థంగా ఉన్న 18 కులాలకు 9%, గ్రూప్-3లో మెరుగైన స్థితిలో ఉన్న 26 కులాలకు 5% రిజర్వేషన్ కేటాయించామన్నారు. కొత్త వర్గీకరణలో 33 కులాలు పాత స్థానాల్లోనే కొనసాగగా, 26 కులాలే మార్చబడ్డాయని తెలిపారు. వచ్చే జనాభా లెక్కల తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయని, ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు.

