పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలో గల వివిధ వార్డులోని గల్లీ గల్లీకి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ నాయకులతో కలిసి కలియ తిరిగారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పనులను పరిశీలించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలను వెంటనే తీర్చాలని, అసంపూర్తి రోడ్ల వల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. ప్రజల ప్రతి సమస్యను తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ఈరోజు తొర్రూరు పట్టణంలోని కొన్ని వార్డులలో గల్లి గల్లి కి తిరిగానన్నారు. స్థానిక ప్రజలు చెప్పిన అన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. తొర్రూర్ ను మరింత అభివృద్ధి చేయడానికి తాము కృషి చేస్తున్నామని, తొర్రూరు అభివృద్ధికి నిధులు కేటాయించమని సీఎంను కోరినట్లు తెలిపారు. ఇదే సందర్భంలో ప్రజలకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

అమృత్ పైపులైన్, తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

తొర్రూరు పట్టణంలో గల్లి గల్లి కి ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా హరిపిరాల రోడ్డులో అమృత పైప్ లైన్ పనులను, అలాగే తొర్రూరు పెద్ద చెరువు వద్ద టియుఎఫ్ఐడిసి నుండి ఐదు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరిశీలించి, ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

