అడుగు ఎఫెక్ట్
వరంగల్ మిల్లు సమస్యను శాసనమండలిలో ప్రస్తావించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జాని కట్టడి చేయాలి
స్థల పరిరక్షణకై ప్రభుత్వానికి బస్వరాజు సారయ్య విజ్నప్తి
రాజ్యసభ సభ్యుడిగా డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఎంపీ నిధులు
తప్పుడు దస్తావేజులతో ఇంటి, వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్లు!
2016లోనే వ్యవసాయ భూమిగా మ్యుటేషన్!?
గత ప్రభుత్వ హయాంలోనే దర్జాగా బడా వ్యాపారి కబ్జా!
మాజీ ఎమ్మెల్యేతో రెవిన్యూ, మున్సిపల్ అధికారులు కుమ్మక్కు!
ఇప్పటి హన్మకొండ కలెక్టరే అప్పటి కమిషనర్ గా అనుమతుల జిమ్మిక్కు!?
మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్వయంగా షాపింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన!
కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది!
సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారని ఎదురుచూస్తోంది!
‘అడుగు’ కలమెత్తితే, ‘బడుగు’ గళమెత్తాడు. కార్మికుల కుటుంబాలు కదం తొక్కితే, ప్రజా సంఘాలు పదం కలిపాయి. ప్రతిపక్షాలు అఖిలపక్షమై ఏకపక్షమయ్యాయి. స్వపక్షంలోనే విపక్షం నిరసన స్వరమెత్తింది. శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గళమెత్తాడు. కాసం మోసానికి కార్మికులు కకావికళమయ్యారు. గరళమైన అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జాపై ఉద్యమ గళాలన్నీ యుగళమై పిడికిలెత్తాయి. దర్జాగా కబ్జాకు గురైన అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలం ప్రజా ఉమ్మడి ఉద్యమానికి వేదికైంది. కోట్ల రూపాయల విలువైన భూమి పరిరక్షణ కోసం లక్ష సంతకాల సేకరణ లక్ష్యం ఇంకా కొనసాగుతోంది. తమ ఆర్తనాదం అరణ్యరోదనై, సకల కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది. సబ్బండ వర్గాల సమాజం ఆ స్థల పరిరక్షణ కోసం నిరీక్షిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిగారే స్వయంగా స్పందిస్తారని ఎదురుచూస్తోంది! మరి సీఎం గారు స్పందిస్తారా? కార్మిక లోక నిరీక్షణ ఫలిస్తుందా?
చారిత్రక వరంగల్ అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల వివాదం అసెంబ్లీ దాకా వెళ్ళింది. అందరి దృష్టి ఇప్పుడు కార్మిక భవన స్థల కబ్జాపై మళ్ళింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యే స్వయంగా గళమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ 3వ సమావేశం, 5వ సెషన్, 3వ రోజు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సారయ్య వరంగల్ అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జా వ్యవహారాన్ని లేవనెత్తారు. అధ్యక్షా అంటూ ఆయన చారిత్రక మిల్లు సమస్య మొత్తాన్ని సూక్ష్మంలో మోక్షంగా వివరించారు. మండలి చైర్మన్ ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.


అధ్యక్షా!
1934లోనే వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అజం జాహీ మిల్స్ ప్రారంభమైంది. ఈ మిల్లుకు కు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి కుమారుడు ప్రిన్స్ అజామ్ జాహ్ పేరు పెట్టారు. 200 ఎకరాలకు పైగా భూములతో ఏర్పాటైన ఈ మిల్లు దేశంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమలలో ఒకటి. స్వాతంత్య్రానికి ముందు, ఈ మిల్లు 10 వేల మందికి పైగా ఉపాధిని కల్పించింది. ఈ మిల్లు సైరన్ వరంగల్, చుట్టుపక్కల గ్రామాల నివాసితులకు ఉదయం వేక్-అప్ కాల్‌గా వచ్చేది. 1974లో బెంగళూరుకు చెందిన నేషనల్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ ఈ కంపెనీని స్వాధీనం చేసుకుంది.1980 చివరి వరకు ఆరు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఈ మిల్లును, 1990ల ప్రారంభంలో మూసివేశారు. 2008లో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా)కి ఈ భూమి ఇవ్వగా, దాన్ని ప్లాట్లుగా తయారుచేసి విక్రయించారు. మిల్లులో పనిచేసి రిటైర్డ్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం 30 ఎకరాలు మాత్రమే మిగిలింది. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 1984నాటి పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ (ఆస్తి పన్ను విధింపు) రికార్డుల సర్టిఫై కాపీని తేదీ: 06-01-2025న అధికారికంగా తీసుకోవడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న అప్పటి అసెస్మెంట్ బిల్లును పరిశీలించగా, 1984లో అప్పటి వరంగల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ (ఆస్తి పన్ను విధింపు) ప్రకారం ఎజె మిల్స్ స్టాఫ్ బిల్డింగ్ పేరున రకరకాల పద్దుల సవరింపులతో రూ.135.55 పై.ల పన్ను విధించినట్లుగా ఉంది. మొత్తానికి 1984 నాటి రికార్డుల ప్రకారమే అంటే 41 ఏళ్ళ క్రితమే అది అప్పటి వరంగల్ మున్సిపాలిటీలో ఒక ఇంటి నెంబర్ కలిగి ఉండటమేగాక, ఆ భవనానికి ఆస్తి పన్ను కింద పన్ను కట్టినట్లుగా కూడా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 80 ఏళ్ళుగా కార్మికుల పోరాటాలకు వేదికగా నిల్చిన కార్మిక భవనానికి, మున్సిపాలిటీ ఇంటి నెంబర్ కలిగివున్నప్పటికీ 2016లో అప్పటి వరంగల్ ఎమ్మార్వో వ్యవసాయ భూమిగా మ్యుటేషన్ చేశారు. వరంగల్ అజం జాహి మిల్లుతో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ కు అవినాభావ సంబంధం ఉంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకొని విశ్రాంత ఉద్యోగులుగా జీవితాన్ని గడుపుతున్న క్రమంలో వారికి అజంజాహి మిల్లు భూముల్లోనే స్థలాలు ఇప్పించడంలో బండ ప్రకాష్ కృషి చేశారు. అదే అనుబంధంతో ఎంపీగా రూ.20 లక్షలు నిధులు ఇచ్చారు. దఫా దఫాలుగా నిధులు ఇస్తానని ముందుకు వచ్చారు. ప్రొసీడింగ్ నెంబర్ 26/ఎంపీ లాడ్స్/బిపి/వరంగల్ అర్బన్/2018-19, తేది:12/02/2020 తో అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రోసీడింగ్ ఇచ్చారు. కానీ, కార్మిక భవనాన్ని కట్టనివ్వలేదు.

అధ్యక్షా!
తప్పుడు దస్తావేజులు సృష్టించి, వ్యవసాయ భూమిగా, ఇంటి స్థలంగా రెండు వేర్వేరు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కార్మిక భవనం ఉన్నచోట బహుళ అంతస్తుల వ్యాపార భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అప్పటి కమిషనర్ అనుమతులు ఇచ్చారు. దీనికి అప్పటి స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. మంత్రి కొండ సురేఖ భర్త కొండా మురళి స్వయంగా ఆ బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ విషయం తనకు తెలియదని బుకాయించారు. రాజకీయ నాయకుల సలహాతోనే సదర్ వ్యాపారి కోర్టుకు వెళ్లారు. మిల్లు కార్మికుల కుటుంబాల వారసులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు అంతా కలిసికట్టుగా అజం జాహి మిల్లు కార్మిక భవన పరిరక్షణ కోసం ఉద్యమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలాన్ని పరిరక్షించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది! సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారని ఎదురుచూస్తోంది!


