అడుగు ఎఫెక్ట్
ఎం.ఇ.ఓ.లు, హెచ్.ఎం.ల మీటింగ్ లో ‘అడుగు’ కథనాలని ప్రస్తావించిన కలెక్టర్
అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో వెంటనే ఏర్పాటుకు ఆదేశాలు
హెచ్.ఎం. ని అడిగి మరీ స్పందించి నిధులిచ్చిన జిల్లా ఉన్నతాధికారి
పాలకుర్తి బడికి టాయిలెట్లు, గేట్లు మంజూరు
ప్రహారీ గోడ… సీసీ కెమెరాలు కూడా…
ఎం.ఇ.ఓ. సందర్శనం… స్కూల్ ఆవరణ పరిశుభ్రం
హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు
‘అడుగు’కు అభినందనల వెల్లువ

“పగటి పూట సాగు.. బడి! రాత్రి పూట..‘తాగు’ బడి!!… ఇదేం.. ఏలు ‘బడి’!?” శీర్షికలతో ‘అడుగు’ లో వరసగా వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్పందించారు. నేరుగా ఆయనే కలుగ చేసుకుని మరీ, తగిన నిధులు మంజూరు చేశారు. 50ఏళ్ళు పైబడిన చారిత్రాత్మకమైన పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ కి టాయిలెట్లు, గేట్లు మంజూరు చేశారు. శిథిలావస్థలో ఉన్న ప్రహారీ గోడ.. నూతనంగా కట్టడమే కాకుండా, సీసీ కెమెరాలు కూడా బిగించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే అంచనాలు రూపొందించి, పనులు ప్రారంభించాలని విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖకు సంబంధించి 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే విధంగా చేయాల్సిన కసరత్తుపై కలెక్టర్ బుధవారం జనగామ ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ లో జిల్లాలోని ఎంఇఓలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాలకుర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాచర్ల శోభారాణిని నేరుగా ప్రశ్నించారు. ” ‘అడుగు’ ఈ పేపర్ లో వస్తున్న కథనాలు మీరు చూశారా? మీ స్కూల్ లో టాయిలెట్స్, గేట్లు లేవా అమ్మా?” అని అడిగారు. అవును సార్ .. ప్రహారీగోడ కూడా సరిగా లేదు సార్ అని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో వెంటనే పాలకుర్తి హై స్కూల్ కి టాయిలెట్స్, గేట్లు, ప్రహారీగోడ, సీసీ కెమెరాలు వంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని, తగు అంచనాలు రూపొందించి, తన వద్దకు రావాలని, సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అక్కడే ఉన్న డి. ఇ. ఓ., విద్యాశాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతో పాలకుర్తి హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎం.ఇ.ఓ. సందర్శనం… స్కూల్ ఆవరణ పరిశుభ్రం

మరోవైపు పాలకుర్తి ఇన్చార్జీ మండల విద్యాశాఖాధికారి పోతుగంటి నర్సయ్య పాలకుర్తి హై స్కూల్ ని సందర్శించారు. స్కూల్ ఆవరణలో పడి ఉన్న చెత్తా చెదారాన్ని చూసి, చివాట్లు పెట్టారు. వెంటనే ఆవరణను పరిశుభ్రం చేయాలని, చెత్తా చెదారాన్ని తొలగించాలని ఆదేశించారు. అంతేకాకుండా కొద్దిసేపు అక్కడే హెచ్. ఎం.తో పాటు ఉండి ఆ పనులను పర్యవేక్షించారు. దీంతో సాయంత్రం కల్లా స్కూల్ ఆవరణ పరిశుభ్రంగా మారింది.
హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న టీచర్లు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు

ఇదిలావుండగా స్కూల్ ఆవరణ పరిశుభ్రంగా మారడం, జిల్లా కలెక్టర్ స్పందించి ప్రహారీగోడ, గేట్లు, సీసీ కెమెరాలు వెంటనే మంజూరు చేయడం పట్ల టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే యశ్వస్వినీ రెడ్డి అభినందనలు

పాలకుర్తి హై స్కూల్ సమస్యల పరిష్కారం కోసం వెంటనే నిధులు మంజూరుకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వస్వినీ రాజారామ్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. అలాగే ‘అడుగు’ కథనాలు హై స్కూల్ సమస్యలకు పరిష్కారాలు చూపాయని, ఇలాగే మరిన్ని మంచి కథనాలతో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేయాలని సూచిస్తూ, ‘అడుగు’ను, ‘అడుగు’ టీమ్ ను ఆమె అభినందించారు.
‘అడుగు’కు అభినందనల వెల్లువ

‘అడుగు’ డిజిటల్ మీడియా ఈ పేపర్ లో వరసగా “పగటి పూట సాగు.. బడి! రాత్రి పూట..‘తాగు’ బడి!!, ఇదేం.. ఏలు ‘బడి’?” శీర్షికలతో వరసగా వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్వయంగా స్పందించడం, వెంటనే ప్రహారీగోడ, గేట్లు, సీసీ కెమెరాలు మంజూరు చేయడం, ఎంఇఓ సందర్శించడం, పాఠశాల ఆవరణలోని పరిసరాలు పరిశుభ్రం కావడం పట్ల అడుగు పాఠకులు, పాలకుర్తి ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడమేగాక, అడుగు ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.

మరి, స్వీపర్, నైట్ వాచ్ మన్ పోస్టుల సంగతేంటి?
పాలకుర్తి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఉన్న వాచ్ మన్ దాదాపు ఏడాది క్రితమే రిటైర్ అయ్యారు. ఆతర్వాత ఆ పోస్టులో మరెవ్వరినీ నియమించలేదు. దీంతో హై స్కూల్ కు వాచ్ మన్ లేకుండానే ఏడాది గడచిపోయింది. పాలకుర్తి స్కూల్ కి స్వీపర్లు కూడా లేరు. కొంత కాలం సపాయి కార్మికులతో పరిశుభ్రం చేయించారు. కానీ, కొద్ది రోజులుగా తాత్కాలిక పద్ధతిలో స్కావెంజర్స్ ని నియమించారు. ప్రస్తుతం స్వీపర్ల సమస్య కొంత తీరినా, శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. అయితే, నైట్ వాచ్ మన్ ను వెంటనే నియమించాలి. స్వీపర్లు కూడా కావాలి. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఇతర ఉన్నతాధికారులు ఈ దిశగా ఆలోచించాలి.

