హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కొత్త ఫెసిలిటీ ప్రారంభం
అభివృద్ధికి కీలకమైన ముందడుగు
– సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్‌తో రాష్ట్ర భాగస్వామ్యాన్ని ప్రాముఖ్యతను గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఇండియా తన ప్రయాణంలో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని, హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్‌కు ఈ నగరం కేంద్రంగా మారిందని అన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ వల్ల రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చూపనుందని, ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వం కలిసి “ADVANTA(I)GE TELANGANA” పేరుతో ఏఐ ఫౌండేషన్ అకాడమీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు పాలన, ప్రజా సేవల్లో ఏఐ వినియోగానికి తోడ్పడనున్నారు. ఈ పెట్టుబడి స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతంతో పాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్‌వర్క్ యాక్సెస్‌ను అందించనుంది.
మైక్రోసాఫ్ట్ సహకారంతో ఏఐ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇది క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందని, తెలంగాణ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ మద్దతు కీలకమని చెప్పారు. ఈ భాగస్వామ్యం తెలంగాణను టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు.

