బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ,
కాంగ్రెస్‌లో వలసల జోరు
ఝాన్సీ రెడ్డి సమక్షంలో కీలక మైనారిటీ నేత పార్టీలో చేరిక
పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బి.ఆర్.ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా శనివారం జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మహమ్మద్ మదార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ పరిణామం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.

ఎర్రబెల్లి నాయకత్వంపై అసంతృప్తి కారణమా?
బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంపై ఉన్న అసంతృప్తే ఈ వలసలకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు వర్గాల సమాచారం ప్రకారం, మరికొంత మంది బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. పార్టీ లోనికి నూతన రక్తం తీసుకురావడంలో విఫలమవుతుండటం, నాయకత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే భావనతో పలువురు అసంతృప్త నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.
సీనియర్ నేతల గందరగోళం
తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించినప్పటికీ, అనుచరులను కాపాడుకోలేకపోతున్నందుకు మాజీ మంత్రి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అధికారం కోల్పోతామన్న భయం, అనుచరులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్న విధానం ఆయనను కలవరపెడుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.
వ్యూహాత్మకంగా కాంగ్రెస్
ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. బీఆర్‌ఎస్‌లో అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు ఎన్నికల ముందు మాజీ మంత్రి నేర్పిన రాజకీయాన్ని వాడుతున్నారు. ఈ పరిణామాలు సాగుతున్న వేళ, బీఆర్‌ఎస్ నాయకత్వం దీనికి ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

