తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, ముఖ్యంగా బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని, ప్రతీ స్థాయిలో విజయం సాధించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేయాలని సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలాన్ని పెంపొందించేందుకు, ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవ విజయాలు సాధించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని గుర్తుచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, నిర్మాణ అనుమతులు, నిధుల కేటాయింపు వంటి పనులను వేగంగా పూర్తి చేయాల్సిందిగా సంబంధిత మంత్రులను కలవాలని సూచించారు.
పార్టీ లైన్ దాటి మాట్లాడే నేతల వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే నేతలపై కఠినంగా స్పందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాలపై ఎవరికైనా సందేహాలు ఉంటే, అంతర్గతంగా చర్చించాలని సీనియర్ నేతలు సూచించారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభలకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయించారు.
సమావేశంలో నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.

