తెలంగాణలో కులగణన సర్వేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కారు అసమగ్రంగా, తప్పుడు లెక్కలతో కులగణన సర్వేను పూర్తి చేసిందని, ఇది పూర్తిగా పార్లమెంటును తప్పుదోవ పట్టించడమేనని మండిపడ్డారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటన అసత్యమని, బీసీల జనాభా గణనను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య 1.85 కోట్లుగా తేలిందని, ఇది రాష్ట్ర జనాభాలో 51 శాతమని, మైనారిటీల్లో ఉన్న బీసీలను కలిపితే ఈ సంఖ్య 61 శాతానికి పెరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సర్వే ప్రకారం బీసీల జనాభా 1.64 కోట్లకు తగ్గిపోయిందని, 46 శాతానికి పడిపోయిందని ఇది ఏ విధంగా సాధ్యమో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ప్రస్తావనకు రాకపోవడం ద్వారా, కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంపై చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు. తప్పుడు లెక్కలతో కులగణన సర్వేను పూర్తిచేసి బీసీలకు అన్యాయం చేశారని, వారికి జరిగిన మోసానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఓ బూటకమని, ప్రజలను మోసం చేసేందుకు చేసిన ప్రయత్నమని, దీనిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మబోరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% రిజర్వేషన్ హామీ గ్యారంటీల గారడీగా మారిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు, ఇకపై ఏ ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మబోరని తేల్చిచెప్పారు.

