-కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీతో ఎమ్మెల్యే యశస్వినీ, ఝాన్సీరెడ్డి
-ఢిల్లీకి పిలిచి మరీ ప్రశంసించిన ప్రియాంక
-ప్రియాంకతో కలిసి లంచ్ చేసిన పాలకుర్తి అత్తాకోడళ్ళు!
-శుభాకాంక్షలు, అభినందనలతోపాటు పాలకుర్తి పురోగతికి అత్తా కోడళ్ళ వేడుకోళ్ళు
ప్లీజ్… ట్రై టు విజిట్ అవర్ పాలకుర్తి. మా పాలకుర్తికి రండి!. పోరాట, చారిత్రక, ఆధ్యాత్మిక, సాహిత్య, సాంస్కృతిక, పర్యాటకంగా సుసంపన్నమైన పాలకుర్తి ప్రాంతాన్ని చూడండి. మా ప్రాంత, ప్రజల అభివృద్ధికి తోడ్పాటునందించండి. అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఇటీవలే వాయనాడ్ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ వాద్రాని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్వినీరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ హనుమాండ్ల ఝాన్సీరెడ్డిలు కోరారు. ప్రియాంక గాంధీ పిలుపు మేరకు సోమవారం ఢిల్లీకి వెళ్ళిన పాలకుర్తి అత్తాకోడళ్ళకు ఆమె నుండి అపూర్వ ఆదరణ లభించింది. వారిని సాదరంగా ఆహ్వానించిన ప్రియాంక వారితో కలిసి లంచ్ చేశారు. వారి నేపథ్యం, పాలకుర్తి ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధి వంటి అనేక అంశాలను కలబోసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించినందుకు ప్రియాంక అత్తాకోడళ్ళకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అలాగే వయనాడ్ లో గెలిచిన ప్రియాంక గాంధీకి యశస్వినీ, ఝాన్సీరెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. తమ గెలుపు కోసం ఆనాడు తొర్రూరుకు వచ్చిన ప్రియాంకకు ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాదు. నిజంగా మీరు అత్తాకోడళ్ళా? లేక తల్లీ బిడ్డలా? అంటూ మరోసారి ప్రియాంక నవ్వుతూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రియాంక గాంధీ పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో జరిగిన బహిరంగ సభలోనూ ఇలాగే ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తల్లీబిడ్డల్లా కలిసి ఉన్న ఈ అత్తా కోడళ్ళు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రపంచానికి ఆదర్శమని అభినందించారు. వారి అన్యోన్యతని చూసి అబ్బురపడుతూ ప్రశంసించారు. కాగా, పాలకుర్తి చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతమని, అనేకమంది కవులు, రచయుతలు, కళాకారులు, పోరాట యోధులకు పుట్టినిల్లు అని, త్యాగాలకు నిలయమని, గొప్ప పర్యాటక ప్రాంతమని ఆమెకు వివరించారు. పాలకుర్తి ప్రజలు ఎంతో చైతన్యవంతులని, కానీ, ఈ నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృధ్ధి చెందలేదని, ఈ ప్రాంతానికి ఒకసారి రావాలని వారు ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. అలాగే తమ నియోజకవర్గ పురోగతికి అన్ని విధాలుగా తోడ్పడాలని అభ్యర్థించారు. ఇందుకు ప్రియాంక తమ సమ్మతిని తెలిపారు. తమను ఢిల్లీ కి పిలిచి ఆదరించిన ప్రియాంక గాంధీకి పాలకుర్తి అత్తా కోడళ్ళు ధన్యవాదాలు తెలుపుతూ, సంతోషం వ్యక్తం చేశారు.

