గ్రేటర్ హైదరాబాద్ సిటీలో తాగునీటి సరఫరా అవసరాలకు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ జలమండలి బోర్డు సమావేశంలో మాట్లాడిన సీఎం, 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం చేయాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బోర్డు ఛైర్మన్‌గా అధ్యక్షత వహించారు.
ప్రస్తుతం 13.79 లక్షల కనెక్షన్లకు 9800 కిలోమీటర్ల నెట్వర్క్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని, గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టు ద్వారా నీటి అవసరాలు తీర్చుకోవాలని నిర్ణయించారు. మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకొచ్చేందుకు ఆమోదం ఇచ్చారు. సిటీ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు.
ఆదాయ వ్యయాల అంశంలో, జలమండలికి రూ. 8,800 కోట్ల రెవిన్యూ లోటు ఉన్నట్లు ఎండీ అశోక్ రెడ్డి వివరించారు. ఈ లోటును అధిగమించేందుకు ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని, ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లుల కోసం నిధుల సమీకరణ మార్గాలు అన్వేషించాలని సీఎం సూచించారు. పాత పైపులైన్లు పునరుద్ధరించేందుకు కేంద్ర జల జీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేలా ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయాలని ఆదేశించారు.
తదుపరి ప్రణాళికల్లో ఇంటింటికీ తాగునీటి సరఫరా, సీవరేజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

