నల్గొండ ప్రజల దశాబ్దాల కలగా నిలిచిన ఎస్ఎల్‌బీసీ (SLBC) ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. జలసౌధలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SLBC ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని హెచ్చరించారు. కంటితుడుపు పనులు మానుకోవాలని, పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని వార్నింగ్ ఇచ్చారు.
SLBC ప్రాజెక్ట్ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంగా ఉండగా, ప్రాజెక్ట్‌ను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో భూగర్భజలాలు దెబ్బతిన్నాయని, తన కుటుంబం 26 బోర్లు వేసినా నీళ్లు రాలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, డిప్యూటీ సీఎం పూర్తి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. అమెరికా ఇంజనీర్ల సహకారంతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ ఆలస్యం వల్ల ఖర్చులు పెరిగిపోతాయని, ఏ చిన్న సమస్యల వల్లనూ పనులు ఆగకూడదని హితవు పలికారు. SLBC ప్రాజెక్ట్ పూర్తయితే అది ప్రపంచ ప్రాముఖ్యత పొందుతుందని పేర్కొన్నారు.

