మన పీవీ చెక్కిన శిల్పం మన్మోహనుడు!
-అసెంబ్లీ సంతాప తీర్మానంలో మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీలో తాను ఎన్ని ఇబ్బందులెదుర్కొన్నా, ఏనాడూ ఆ పార్టీని ఒక్క మాట కూడా అనని వీర విధేయుడు మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి టి.హరీశ్ రావు కొనియాడారు. సోమవారం శాసనసభలో జరిగిన మన్మోహన్ సింగ్ సంతాప సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తున్నదని స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని సమర్ధిస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని హరీశ్ రావు కోరారు. పెద్దల సభలో 33 సంవత్సరాలు పనిచేసిన మన్మోహన్ కు రాష్ట్ర పెద్దల సభ శాసనమండలిలో కూడా సమావేశం ఏర్పాటు చేసి నివాళులర్పిస్తే మరింత బాగుండేదని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
‘‘ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, ఆ ఓటమికి మన్మోహన్ సింగ్, పీవీ ఆర్థిక విధానాలు కారణమని ఏఐసీసీ ఆంటోనీ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీనిపై ఏఐసీసీలో చర్చపెడితే మన్మోహన్ కంట తడి పెట్టారే తప్ప, తనను కాంగ్రెస్ నాయకులే తప్పుపట్టారని బాధపడలేదు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ కంటతడి పెట్టిన వార్తపై దేశమంతా చర్చ జరిగింది’’ అని హరీశ్ రావు గుర్తు చేశారు.
‘‘ మరో సందర్భంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారికి రెండేళ్ల జైలు శిక్ష పడితే, లాలూను రక్షించేందుకు ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. అపుడుప్రధానిగా ఉన్న మన్మోహన్ నిర్ణయం సరైందేనంటూ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. హఠాత్తుగా అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ వచ్చి ఆర్డినెన్స్ కాపీలను చింపివేశారు. ఒక ప్రధానిగా మన్మోహన్ సింగ్, వారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అయినా, మన్మోహన్ మౌన మునిలానే ఉన్నారు తప్ప, నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదని, అందుకే కాంగ్రెస్ వీర విధేయుడు మన్మోహన్ సింగ్’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
అదేవిధంగా రెండోసారి ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో చాలా కుంభకోణాలు,కేసులు, అరెస్టులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయని, అపుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఒక చిన్న మచ్చకూడా రాకుండా చూసుకున్నారంటే, అది వారి గొప్పతనమేనని హరీశ్ రావు కొనియాడారు. కేంద్ర కేబినెట్లో చేరిన కేసీఆర్ కు నౌకాయాన మంత్రి పదవినిస్తే, డీఎంకే పార్టీ కోసం ఆ శాఖను త్యాగం చేసి, తెలంగాణ కోసం 6 నెలల పాటు ఏశాఖ లేని కేంద్రమంత్రిగా ఉన్నారని మన్మోహన్ సింగ్ కేసీఆర్ ను ప్రశంసించారని హరీశ్ రావు గుర్తు చేశారు.
మన్మోహన్ సింగ్ ను తన కేబినెట్లోకి ఆర్థికమంత్రిగా తీసుకొని, దేశ రాజకీయాలకు పరిచయం చేసింది తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావేనని, పీవీ నమ్మకాన్ని నిలిపిన మన్మోహన్ దేశ ఆర్థిక రంగానికి దశ, దిశను చూపారన్నారు.
కారణాలేమోగానీ పీవీ గారు మరణించిన రోజు కాంగ్రెస్ పట్టించుకోలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే పీవీ ఘాట్ ను, పీవీ పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. పీవీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, పీవీ జయంతి, వర్థంతులను అధికారికంగా జరిపించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనన్నారు. అంతేగాకుండా పీవీగారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపి, మన పీవీ, మన ఠీవి అని పీవీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత కూడా కేసీఆర్ గారిదేనని హరీశ్ రావు అన్నారు.

